ఐటీ శాఖ తెలుగు రాష్ట్రాల్లోని మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన సోదాల్లో రూ. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని ప్రకటించింది. ఆ మూడు కంపెనీలకు ఒక దానితో ఒకటి సంబంధం లేదు. కానీ సోదాలు జరిపిన వారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ ఉన్నారు. ఈ ఒక్క లింక్ చాలు.. ఇక నేను రెచ్చిపోతా అన్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా, వైసీపీ నేతలు… చంద్రబాబు నేరం రుజువైపోయిందని.. తక్షణం ఆయనకు శిక్షలు వేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఐటీ శాఖ విడుదల చేసిన నోట్లో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావనే లేదు కానీ సాక్షి పత్రిక… చంద్రబాబు అవినీతి ఓ భాగం దొరికిపోయిందని … కథనం రాసేసింది. వెంటనే.. వైసీపీ నేతలు.. దాన్ని అందుకున్నారు. చంద్రబాబు చేసిన రూ. లక్షల కోట్ల బాగోతం బయటపడుతోందని.. ఈ ఐటీ దాడులపైప వవన్ కల్యాణ్ నోరు విప్పాలని… జగన్ ఆంతరంగీకుల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. జగన్ సంపాదన మాత్రం తెరిచిన పుస్తకమని తేల్చేశారు.
శ్రీకాకుళంకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ విషయంలో.. మరింత దూకుడుగా ఉన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని రుజువైందన్నారు. తానొక్కడే శ్రీరాముడన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని.. చంద్రబాబు పీఏ రూ.2 వేల కోట్ల అక్రమార్జన చేసినట్లు తేలిందన్నారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు నిరూపణ కాలేదని .. చంద్రబాబు ఇకనైనా నీతులు చెప్పడం మానుకోవాలని చెప్పుకొచ్చారు. వీళ్లు మాత్రమే కాదు.. మీడియా ముందు నోరు విప్పగలిగిన ప్రతీ నేతా.. ఆ మూడు కంపెనీల్లో జరిగిన రూ. రెండు వేల కోట్ల అవకతవకలు చంద్రబాబువేనని.. చెప్పేశారు. తక్షణం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రకటనలను.. టీడీపీ నేతలు ఖండించారు. 40 ఏళ్లలో చంద్రబాబు వద్ద 15 మంది పీఎస్‌లు, పీఏలు పనిచేశారని.. వారిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబును అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోడానికే ఎదుటివాళ్లపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందని.. హైకోర్టులో సీబీఐ పిటిషన్‌కు జగన్ జవాబు ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. జగన్‌కి అవినీతి కనపడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు నారా లోకేష్ ట్వీట్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసి వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని జైలు పిలుస్తుందని.. అందుకే ఐటీ దాడులతో లింక్ పెడుతున్నారని విమర్శించారు. మొత్తానికి నిన్ననే సీబీఐ… జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.. ఆ విషయం హైలెట్ కాకుండా… వైసీపీ నేతలకు.. ఐటీ నోట్ బాగా ఉపయోగపడుతోంది.