రాజధానిని అమరావతిలో ఉండేలా చూసే షరతుతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని ప్రకటించిన పవన్ కల్యాణ్ టోన్‌లో ఇప్పుడు మార్పు వచ్చింది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదిని.. బీజేపీ నేతల వాయిస్‌ను కొత్తగా రాజధాని గ్రామాల్లో వినిపించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘిభావం తెలిపిన పవన్ కల్యాణ్.. ఆ దీక్షా శిబిరాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతానికి భిన్నంగా తాను నిస్సహాయుడ్నని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. నేను రోడ్డుపైకి వస్తే రాజధాని తరలింపు ఆగుతుందంటే మాట ఇస్తా.. నా చేతిలో లేనప్పుడు ఎలా మాట ఇవ్వగలనని రైతుల్ని ప్రశ్నించారు. కానీ రాజధాని ఇక్కడే ఉండేలా చూస్తానని హామీ ఇస్తున్నానని ప్రకటించారు. రైతులు భూములను టీడీపీ కోసం ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఇచ్చారని.. 3 రాజధానులు పెడతామని ఎన్నికల్లో గెలవకముందే జగన్ చెప్పాల్సిందన్నారు. ఇప్పుడు ప్రజల్ని నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు.
యూపీఏ తీసుకొచ్చిన ఆధార్‌ని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తోంది.. అమరావతిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం కానీ.. ఆ నిర్ణయం 2014లోనే జరిగిపోయిందన్నారు. అమరావతిలో అన్ని కులాలు, మతాల వారి భూములున్నాయని.. టీడీపీతో గొడవ ఉంటే వాళ్లను ఏమైనా చేసుకోండి.. అంతేకానీ రాజధానిని తరలిస్తామంటే ఊరుకోబోమని పవన్ కల్యాణఅ హెచ్చరించారు. చిన్న పెన్నుపోటుతో రాజధాని మారుస్తామంటే కుదరదు..అహంకారం నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇవాళ అమరావతికి జరిగిందే.. భవిష్యత్‌లో కర్నూలు, విశాఖకు కూడా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితమైన అధికారాలు ఉంటాయని కొత్తగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు కానీ..ఆదేశించలేదన్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ వాయిస్‌లో తేడా కనిపించడం రైతుల్ని కూడా అయమోమయానికి గురి చేసింది. ముందుండి పోరాటం చేస్తామని.. బీజేపీతో కలిసి.. అమరావతికి అండగా ఉండటామని.. ఇంచ్ కూడా కదలనివ్వబోమని చెప్పిన పవన్ ఇప్పుడు..కేంద్రానికి పరిమిత అధికారాలు ఉంటాయని.. రాజధాని రాష్ట్రపరిధిలోనిదని.. చెప్పడం… ఆసక్తి రేకెత్తిస్తోంది.