బీజేపీతో ఘర్షణ ఎందుకు..? ఇష్యూబేస్డ్గా వెళ్తాం.. అవకాశం వస్తే..పరిశీలిస్తామని.. ఎన్డీఏలో వైసీపీ చేరికపై మీడియా సమావేశంలో సూటిగా సుత్తి లేకుండా లేకుండా చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు తన రాజకీయ తెలివి తేటలన్నింటినీ ఉపయోగించి తాను ఆ మాటలనలేదన్న వాదనకు దిగుతున్నారు. ఆయన విశాఖలో మాట్లాడిన మాటలను అన్ని ప్రధాన మీడియాలు రిపోర్ట్ చేశాయి. టీవీ చానళ్లలోనూ లైవ్లో వచ్చింది. అయినప్పటికీ.. హఠాత్తుగా బొత్స సత్యనారాయణ.. ఒక్క ఈనాడు పత్రికను టార్గెట్ చేసి.. రామోజీరావుకు బహిరంగలేఖ రాశారు. అందులో.. తన వాదన ఏమిటో చెప్పకుండా… ఆ పత్రిక ఏదో చంద్రబాబు కోసం పని చేస్తున్నదన్న నిందారోపణలకే పరిమితయ్యారు. అసలు తానేమన్నారు.. ఈనాడు అందులో తప్పేమి రాసిందో.. చెప్పనే చెప్పలేదు. పైగా ఓ వీడియోను పంపుతున్నానంటూ చెప్పుకొచ్చారు.
బొత్స పంపిన వీడియోలో ఏముందో కానీ.. ఆయన ఎన్డీఏలో చేరికపై మాట్లాడిన మాటలు మాత్రం.. ఇంటర్నెట్లో మరో పదేళ్లయినా సజీవంగానే ఉంటాయి. ఎవరూ ట్యాంపర్ చేయలేరు కూడా. ఆ విషయం తెలిసి కూడా.. తాను అసలు ఎన్డీఏలో చేరడం గురించి.. అసలు మాట్లాడలేదన్నట్లుగా.. ఈనాడు అధినేత రామోజీరావుపై.. ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేసి కవర్ చేసుకుందామనుకుంటున్నారు. గతంలోనూ.. అమరావతిని స్శశానంగా ప్రకటించి.. ఆ తర్వాత మాట వరసకు అన్నదని.. తన మాటల్ని మీడియా వక్రీకించిందని చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ ఇలా తన ప్రకటనపై మడమ తిప్పడానికి కారణం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వార్నింగ్ రావడమేనన్న ప్రచారం జరుగుతోంది.
బొత్స తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకోగానే.. అటు వైసీపీ నేతలు బొత్సను.. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం ప్రారంభించారు. కేంద్రంలో వైసీపీ చేరడంపై జగన్ మాత్రమే ప్రకటన చేస్తారని ఇతరులు ఎవరైనా పిచ్చాపాటిగా మాట్లాడితే అది పార్టీ మాట కాదని కొడాలి నాని తేల్చి చెప్పారు.ఇతర నేతలు కూడా అదే రీతిలో స్పందించారు.