తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ వచ్చిన దగ్గర్నుంచీ ఈ వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు, రాష్ట్ర వాటాల కోసం కేంద్రంతో పోరాడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంటున్నారు. తెరాస విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకూ మెట్రో రైల్లో ఆయన ప్రయాణించారు. మెట్రో రైలు సేవలపై అధికారులతో సమీక్షించారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు.
మంత్రి కేటీఆర్ అనవసరంగా మోడీ సర్కారు మీద విమర్శలు చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం ఏమీ ఇవ్వలేదనీ, ఇచ్చేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పేదలకు ఎన్ని ఇళ్లు కడతావో కట్టివ్వు, మా వాటాగా నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు రూ.1 కి కేజీ బియ్యం పథకం వెనక కేంద్రం ఉందనీ, కిలోకి రూ. 28 చొప్పున ఈ పథకానికి కేంద్రం నిధులిస్తోందన్నారు. ప్రతీ పేదవాడికీ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేంద్రం సిద్ధంగా ఉంది, దాన్ని ఎంతమందికి వాడుకుంటారో వాడుకోవాలన్నారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా పేదవారికి కేంద్రం ఇస్తున్న సదుపాయాలు సక్రమంగా అందడం లేదో కేటీఆర్ విశ్లేషించి చెప్పాలన్నారు. కేంద్రాన్ని విమర్శించడమే అజెండాగా పెట్టుకుంటే చేస్తున్న పనులేవీ కనిపించవన్నారు. హైదరాబాద్లో మెట్రో నిర్మాణానికి రూ. 1458 కోట్లు కేంద్రం ఇచ్చినవే అన్నారు. అయితే, ఫలక్ నుమా వరకూ మెట్రో నిర్మాణం చేస్తామని చెప్పారనీ, కానీ అది ఇంకా పూర్తిచెయ్యలేదన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుకుంటోందనీ, మజ్లిస్ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్, తెరాసలు గతంలో చేసిందేం లేదనీ, భాజపా హయాంలోనే అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఏతావాతా కిషన్ రెడ్డి చెప్పొచ్చే ప్రయత్నం ఏంటంటే… మంత్రి కేటీఆర్ విమర్శలను తిప్పి కొట్టడం. కేంద్రం చాలా ఇచ్చిందంటూ కేటాయింపులవారీగా లెక్కలు చెప్పడానికి ఇదో అవకాశంగా మార్చుకున్నారు. అయితే, కేంద్రం ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ, రాష్ట్ర ప్రభుత్వమే తెచ్చుకోవడంలో ఆలస్యం చేస్తోందనే పాయింట్ హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. మరి, దీనిపై తెరాస నేతలు స్పందిస్తారో లేదో చూడాలి. మెట్రో రైలు లాంటి ప్రాజెక్టుల సాకారం వెనక తమ సహకారమూ ఉందని ప్రచారం చేసుకునే పనిలో భాజపా పడింది. నిజానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ క్రెడిట్ గేమ్ అవసరం ఏముంది..? సమాఖ్య వ్యవస్థలో, రాజ్యంగబద్ధంగా కేంద్ర రాష్ట్రాలు బాధ్యతలు పంచుకోవాలి. నిధులూ వాటాల్లో కేటాయింపులూ అలానే ఉంటాయి. అంతమాత్రాన… ఇస్తున్నది మేమే అని కేంద్రం, చేస్తున్నది మేమే కదా అంటూ రాష్ట్రం ప్రజలకు చెప్పుకోవాల్సిన పనేముంది..?