త్వరలోనే వైఎస్ఆర్సిపి ఎన్డియే లో చేరి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకోనుంది అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఎప్పటిలాగే స్పష్టత తక్కువ ఇచ్చి, గందరగోళాన్ని ఎక్కువ ఇచ్చాయి. దీంతో వైసీపీ నేతలే కొంతమంది రంగంలోకి దిగి బొత్స వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవద్దని అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే వైసిపి సంగతి ఎలా ఉన్నా, ఇటు బిజెపి లోనే పొత్తు విషయమై భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం. ప్రత్యేకించి బిజెపి పెద్దల మాట ఒకటైతే ఎంపీ టిజి వెంకటేష్ మాట మరొక లా ఉండడం గమనార్హం.
వైఎస్ఆర్సిపి బిజెపి మధ్య పొత్తు ఉండబోతుంది అన్న వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఈరోజు స్పందిస్తూ, తమకు తెర వెనుక గాని తెర ముందు కానీ వైఎస్సార్సీపీతో గాని టిడిపి గాని ఎటువంటి సంబంధాలు లేవు అని, ఉండబోవని గతంలో చెప్పిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఇప్పుడు పొత్తు గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు కూడా దీనిపై తమకు సమాచారం లేదని అన్నారు. అయితే వీరందరిది ఒక దారైతే ప్రస్తుతం బిజెపి ఎంపీ గా ఉన్నటువంటి టీజీ వెంకటేష్ ది మాత్రం మరొక దారి లాగా కనిపిస్తోంది. బిజెపి వైసిపి ల మధ్య పొత్తు వార్తలపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటే ఎవరు ఉండరని, ఒకవేళ వైఎస్ఆర్సిపి బిజెపిల మధ్య పొత్తు కుదిరితే మంచిదేనని ఆయన అన్నారు. బహుశా జగన్ నుంచి వచ్చిన సంకేతాల మేరకే బొత్స పొత్తు గురించి మాట్లాడి ఉండవచ్చని, 2019 ఎన్నికలలో బిజెపి సహకారం చేయడం వల్లనే వైఎస్ఆర్సిపి కి ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్సిపి బిజెపి పొత్తు గురించి, పై స్థాయిలో నిర్ణయం జరుగుతుందని ఆయన అన్నారు.
మొత్తానికి పొత్తు విషయంలో అటు బిజెపి పెద్దలు ఒకలా మాట్లాడుతుంటే, ఇటు టీజీ వెంకటేష్ వంటి బిజెపి ఎంపీలు మరొకలా మాట్లాడుతుండటం గమనార్హం. మరి ఈ రెండు పార్టీల మధ్య నిజంగా పొత్తు కుదురుతుందా అన్నది వేచి చూడాలి.