ప్రపంచలో అత్యంత వేగవంతమైన అధ్లెట్గా పేరు తెచ్చుకున్న ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో.. ఓ యువకుడు పరుగెడుతున్నాడని… ఆ యువకుడు ఇండియాలోనే ఉన్నాడని.. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో కంబళ అనే క్రీడలో శ్రీనివాస గౌడ ఈ ఫీట్ సాధించారు. కర్ణాటక గ్రామీణ క్రీడ అయిన కంబళలో దున్నలతో పాటు 142.50 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలోనే చేరుకున్నారని సోషల్ మీడియాలో వీడియో సర్క్యూలేట్ అవుతోంది. ఇది క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆనంద్ మహింద్రా లాంటి వాళ్లు ట్వీట్ చేయడంతో.. కేంద్రం కూడా స్పందించింది. ఆతన్ని.. ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తామని మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు.
130 కోట్ల మందిలో మెడల్స్ తెచ్చే ఆటగాళ్లు లేరా..?
130 కోట్ల మంది ఉన్న భారతీయుల్లో.. ఒలింపిక్స్ పతకాలు తెచ్చే వారు ఒక్కరు కూడా లేరు. ముక్కీ మూలిగి.. చివరికి ఒక్క కాంస్య పతకం తెచ్చుకుని వంద కోట్ల మంది మురిసిపోయిన రోజులు ఉన్నాయి. ఓ వైపు.. లక్షల్లోనే జనాభా ఉండే.. యూరోపియన్ దేశాలు స్వర్ణ పతకాల్లో చరిత్ర సృష్టిస్తూంటాయి. జనాభాలో.. మనకన్నా ఓ అడుగు ముందు ఉన్న.. చైనా… అగ్రస్థానం కోసం పోటీ పడుతూ ఉంటుంది. జనాభాలో ముడో వంతు మాత్రమే ఉండే అమెరికా… అగ్రరాజ్యమనే.. స్టేటస్‌ను నిలబెట్టుకుంటూ ఉంటుంది. కానీ.. ఇండియా మాత్రం.. ముక్కుతూ..మూలుగుతూ ఉంటుంది. దీనికి కారణం.. 130 కోట్ల మందిలో ప్రతిభావంతులు లేకపోవడం కాదు. వారిని గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థ లేకపోవడమే.
ప్రతిభను గుర్తించే వ్యవస్థ ఏ దశలోనూ లేదు..!
క్రికెట్లో సచిన్ టెండ్యూల్కర్ లెజెండ్. ఆ లెజెండ్‌ను మించిన వారు ఇండియాలో లేరనుకోవడం అమాయకత్వం. సచిన్ ప్రతిభను.. గుర్తించారు.. ప్రోత్సహించారు… కానీ అలా గుర్తంపునకు నోచుకోని.. ప్రోత్సాహం అందని.. సచిన్‌లు.. కొన్ని వేల మంది ఉంటారు. వారంతా.. ఏ తాపీ పనో.. క్లర్క్ పనో చేసుకుంటూ సమయం గడిపేస్తూ ఉంటారు. వారిలో నిద్రాణంగా ఉన్న టాలెంట్ అలా అంతమైపోతుంది. దానికి శ్రీనివాసగౌడనే ఉదాహరణ. ఆయన ఏడెనిమిదేళ్లుగా అలా ఉసేన్ బోల్ట్ రికార్డుల్ని చెరిపేస్తూనే ఉన్నారు. కంబళ పోటీల్లో విజయాలు సాధిస్తూనే ఉన్నారు. కానీ ఎవరికీ పట్టలేదు. ఎవరూ గుర్తించలేదు. గుర్తించడానికి ప్రయత్నించలేదు కూడా. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మాత్రమే.. గుర్తింపునిస్తున్నారు.
ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవా..?
స్కూల్ స్థాయి నుంచి విద్యార్థుల్లో ఆటలంటే ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించి.. వారికి తగిన శిక్షణ ఇచ్చి రాటుదేలే ప్రయత్నం చేస్తనే… సచిన్ టెండూల్కర్లు.. శ్రీనివాసగౌడలు బయటకు వస్తారు. లేకపోతే..వారంతటికి వారే… ప్రతిభా ప్రదర్శన చేసుకుని సోషల్ మీడియా పుణ్యమా అని కాస్త ఫేమ్‌లోకి వస్తారు. కానీ.. ఒక్క సారిగా వచ్చే పేరుతో.. వారి మానసిక స్థితి మారిపోతుంది. ఆటల్లో ఈ మానసిక స్థితి చాలా ముఖ్యం. తన గ్రామంలో.. పరుగెత్తగలిగిన శ్రీనివాసగౌడ.. ఒక్క సారిగా… అధ్లెట్గా మారి… స్టేడియంలో పరుగెత్తాలంటే… ఎంతో మానసిక సామర్థ్యాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకపోతే.. సులువుగా ఫెయిలయిపోతారు. కింది నుంచి ఎదిగిలేగా.. ప్రతిభను వెలికి తీస్తేనే… ప్రయోజనం ఉంటుంది.