ఆంధ్రప్రదేశ్లో ప్రతీ రోజూ ఏదో చోట “అసైన్డ్ రైతు ఆత్మహత్యాయయత్నం” అనే వార్త కనిపిస్తోంది. ప్రతి జిల్లాల్లోనూ అసైన్డ్ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కారణం.. వారి భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూండటమే. ఉగాదికి పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చే లక్ష్యాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అందుకు తగ్గ స్థలాలు లేకపోవడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. దాంతో అధికారుల దృష్టి అసైన్డ్ భూములపై పడింది. అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములే కానీ.. అప్పటికే… దళితులు, మాజీ సైనికులకు… ఉపాధి కోసం ఇచ్చేశారు. వారు ఆ భూముల్ని సాగు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు.
ఈ భూముల్ని… వారికి గత ప్రభుత్వమో.., అంతకు ముందు ప్రభుత్వమో ఇవ్వలేదు. రెండు, మూడు తరాలుగా ఆ భూముల్ని సాగు చేసుకుంటున్న ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ భూములపై కన్నేసిన రాష్ట్ర అధికారులు హుటాహుటిన.. ఆ అసైన్డ్ రైతులకు నోటీసులు ఇచ్చి.. ప్రభుత్వానికి అవసరం ఉంటున్నందున తీసుకుంటున్నామని.. అందులో ప్లాట్లుగా చేసి.. మీకు ఓ ప్లాటిస్తామని చెబుతున్నారు. దాంతో.. అసైన్డ్ రైతుల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయి. విశాఖపట్నంలో మాత్రం… ఆరు వేల ఎకరాలకు అధికారికంగా భూసమీకరణ లాంటి ప్రక్రియ చేపట్టారు.
మిగతా చోట్ల మాత్రం.. ఆ భూసమీకరణ అనేది అధికారికంగా లేదు. విశాఖలో కూడా బలవంతంగా సేకరిస్తే.. కబ్జా అన్న ఆరోపణలు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే భూసమీకరణ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడా బలవంతంగానే సేకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం..బడుగు, బలహీనవర్గాలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములనే లాక్కుంటూండటం… అలజడికి కారణం అవుతోంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదు.