కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ వచ్చారు. కేంద్ర బడ్జెట్ పై అనుమానాలన నివృత్తి చేసేందుకు ఆమె వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని నగరాల్లో ఆమె ఇదే తరహా కార్యక్రమాలను నిర్వహించే పనిలో ఉన్నారు. తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ మధ్య తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటులో తెరాస ఎంపీలు కూడా ఇదే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం ఎలాంటి అన్యాయం చెయ్యలేదనీ, నిధుల కేటాయింపుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సొంత ప్రమేయం ఏదీ ఉండదనీ, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారమే కేటాయింపులు జరుగుతాయన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని బలంగా కోరుకుంటారనీ, రాష్ట్రాలతో సఖ్యతతో ఉండాలనే అనుకుంటారని చెప్పారు. రాష్ట్రాల పన్నుల వాటా ఒక శాతం తగ్గించడానికి కారణం ఒక రాష్ట్రం తగ్గింది, రెండు యూటీలు పెరిగాయి. వాటికి నిధుల సర్దుబాటు కోసం తీసుకున్న నిర్ణయం ఇదన్నారు. అన్ని రాష్ట్రాల్లో కేంద్రానికి తమవాటా పన్నులు ఇస్తుందనీ, తెలంగాణ కూడా అలానే చేసిందనీ, మిగతా రాష్ట్రాల కన్నా బాగా చేసిందని మెచ్చుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తాను చూశాననీ, పార్లమెంటులో గివ్ అనే పదం ఓ ప్రశ్నకు జవాబుగా తాను ఉపయోగించాననీ, స్పీకర్ వద్దంటే మానేస్తానని అన్నారు! తెలంగాణకు జీఎస్టీ బకాయిలు ఇవ్వలేదంటూ ఈ మధ్య కేసీఆర్ కూడా అంటున్నారు కదా అని ప్రశ్నిస్తే… ఈ పరిస్థితి అన్ని రాష్ట్రాలకూ ఉందనీ, కేంద్ర చెల్లింపుల్లో కొంత జాప్యమైందని ఆమె అంగీకరించారు. తెలంగాణకు రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యమౌతున్నాయనే ప్రశ్నకు… రాష్ట్రం అనుసరిస్తున్న ధోరణి వల్లనే ఆలస్యమౌతున్నాయి తప్ప, కేంద్రం ఎలాంటి జాప్యం చెయ్యదంటూ వెనకేసుకొచ్చారు!
కేంద్ర ఆర్థికమంత్రి, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఇలా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ విమర్శలకు వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకొచ్చింది..? ప్రధానమంత్రి కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని విశ్వసిస్తారు అని ప్రత్యేకంగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? రాష్ట్రాలకు మేం అన్యాయం చెయడం లేదని కేంద్రమంత్రులు ఇలా పనిగట్టుకుని మరీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే… కేంద్రం ఒంటెత్తుపోకడలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో వారే పరోక్షంగా అంగీకరించినట్టు లెక్క కదా. కేంద్రం పట్ల రాష్ట్రాల ఆవేదనను ఇవాళ్ల తెలంగాణ అద్దంపడుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులున్నా, రాజకీయ కారణాలతో ఆయా ముఖ్యమంత్రులు కేంద్రం తీరుపై కేసీఆర్ మాదిరిగా స్పందించలేకపోతున్నారు. కేసీఆర్ ది కూడా భాజపా పట్ల ఈ మధ్యనే మారిన రాజకీయ వైఖరి, అది వేరే చర్చ. కేంద్రంపై రాష్ట్రాల అసంతృప్తి గళం తెలంగాణ నుంచి పెరుగుతోంది కాబట్టి, ఇక్కడి నుంచే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాలన్నట్టుగా నిర్మలా సీతారామన్ ముందుగా ఇక్కడికి వచ్చారని భావించొచ్చు.