తహసీల్దార్ వనజాక్షి…! ఈ పేరుకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాడు దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ వనజాక్షిపై దాడి చేశారంటూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి వనజాక్షి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి తహసీల్దార్ వనజాక్షిపై ఏ ఎమ్మెల్యే దాడి చేయలేదు. ఆమెనే దాడి చేశారు. అదీ కూడా రైతులపై. మామూలుగా తోపులాట మాత్రమే కాకుండా.. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తిని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ… ఆమె వ్యాఖ్యలు చేయడంతో రైతుల్ని రెచ్చగొట్టినట్లయింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కోసం.. దశాబ్దాల నుంచి రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ ల్యాండ్స్‌ను స్వాధీనం చేసుకుంటోంది.
ఇందులో భాగంగా.. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లికి వనజాక్షి వెళ్లారు. అయితే.. భూములు ఇవ్వబోమని..అది తమ జీవనాధారమని రైతులు చెప్పారు. ఈ క్రమంలో… రైతులతో వాగ్వాదం జరిగింది.
రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని వనజాక్షి మండిపడటంతో… మహిళలు.. ఆమెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వనజాక్షి ని పోలీసు వాహనంలో తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వనజాక్షి ప్రవర్తన.. రైతుల పట్ల ఆమె వ్యవహరించిన తీరు చర్చనీయాంశమయింది.
ఆమె మొదటి నుంచి కృష్ణా జిల్లాలోనే విధులు నిర్వహిస్తూంటారు. కానీ దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన జరిగినప్పుడు ఆమె సరిహద్దుల్ని దాటి… వెళ్లి తన విధుల్ని నిర్వర్తించే ప్రయత్నం చేశారు. ఆమె పరిధి కాకపోయినా గోదావరి జిల్లాలోకి వెళ్లారు. అప్పుడు.. చింతమనేని చేసిన దాడే హైలెట్ అయింది.