మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విస్ట్ ఇచ్చారు. ఆయన గోడ మీద ఉన్నారని.. మొదటి చాయిస్ బీజేపీ అని..రెండో చాయిస్ వైసీపీ అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ హఠాత్తుగా ఆయన బీజేపీ నుంచి 300 మందిని టీడీపీలో చేర్చుకుని రాజకీయవర్గాలకు షాకిచ్చారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గతంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉండేవారు. కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో.. పలువురు ఆశావహుల్ని… టీడీపీలో చేర్చుకుంటున్నారు గంటాశ్రీనివాసరావు. వారిని పార్టీలో చేర్చుకునే క్రమంలో.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలని.. పార్టీ మరింత బలపడాలని ఆశిస్తున్నాన్నారు.
19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత.. ఆయన .. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఓ విధంగా బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలిగారని చెప్పాలి. అందుకే ఎప్పటికప్పుడు… ఆయన పార్టీ మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను ఏ పార్టీలోకి వెళ్తారని.. ఉద్ధృతంగా ప్రచారం జరుగుతుందో.. ఆ పార్టీ నేతల్నే… టీడీపీలోకి చేర్చుకుని ఒక్క సారిగా రివర్స్ షాకిచ్చారు. గంటా తీరుపై విశాఖ టీడీపీ వర్గాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఆయన… ఆ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పడు మాత్రం ఒక్క సారిగా …టీడీపీలో నేతల్ని చేర్చుకుని… హైలెట్ అయ్యారు.