అధికార యంత్రాంగానికి..రాజకీయాలతో సంబంధం ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే.. వారు చెప్పినట్లుగా చేస్తారు. తమకు అనుకూలంగా ఉంటారని భావించిన వారికి పాలకులు కీలక బాధ్యతలు ఇస్తారు. లేదు అనుకున్న వారికి పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టులు ఇస్తారు. పాలకులకు దగ్గరవడానికి కీలక పోస్టుల కోసం.. అధికారులు తమ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అంతకు ముందు ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉన్నారనుకుంటే… అప్రాధాన్య పోస్టు ఇస్తారేమో కానీ ఏదో ఒకటి చేయాలని ఊగిపోయిన ప్రభుత్వాలు ఇప్పటి వరకూ లేవు.
ఉక్కపోతను ఎదుర్కొంటున్న 30 శాతం మంది ఉద్యోగులు
పోలీసుల్లోనే కాదు… ప్రభుత్వంలోని ప్రతీ విభాగంలోనూ…కొత్త ప్రభుత్వ బాధితులు ఉన్నారు. వారు బయటకు చెప్పుకోలేరు. సర్వీస్ రూల్స్ అడ్డు వస్తాయి. ప్రభుత్వం ఖాళీగా ఉంచినా.. జీతం ఇవ్వకపోయినా భరించాల్సిందే. కానీ ఇలాంటి వారిని ప్రభుత్వం ఏ ప్రాతిపదికన దూరం పెడుతోందన్నదే చర్చనీయాంశం అవుతుంది. అనేక రకాల ఆరోపణలు చేసి ఇష్టం లేని వారిపై నిందలేస్తోంది. సస్పెండ్ చేస్తోంది. ఖాళీగా కూర్చోబెడుతుంది. తర్వాత నిజం తేలినా.. పోయేదేమీ ఉండదు. మహా అయితే.. కోర్టుల్లోనో… క్యాట్లోనే రెండు చీవాట్లు….కాకపోతే ఫైన్ వేస్తారు. అది కూడా ప్రజాధనంతో కడతారు. కానీ తాము చేయాలనుకున్న నష్టాన్ని ఆ అధికారులకు చేస్తున్నారు.
వాళ్లను దూరం పెట్టి..ఏదో విధంగా టార్గెట్ చేయడమే లక్ష్యం..!
ఏదో ఒకటి.. ముందు కేసులు పెట్టేసి ఇబ్బంది పెడదామని.. తర్వాత కోర్టులు కొట్టేసినా… పోయేదేముందని.. అనుకునే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఏపీ సర్కార్ టార్గెట్ చేసిన అధికారులెవరిపైనా… కొన్నాళ్ల తర్వాత అభియోగాలు నిరూపితమయ్యే చాన్స్ లేదని.. సర్వీస్ రూల్స్‌లో పండిపోయిన వర్గాలే చెబుతున్నాయి. కానీ లక్ష్యం వాళ్లని కొన్నాళ్లు ఉద్యోగానికి దూరం చేయడం.. మానసికంగా వేధించడం అంటున్నారు. ఏపీలో ఇప్పుడు అదే కక్ష సాధింపు నడుస్తోందని.. జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోందంటున్నారు.
ఉద్యోగులంటే ప్రభుత్వమేనని ఎందుకు నమ్మలేకపోతున్నారు..?
ఉద్యోగులంటే ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వాలే మారతాయి. ఉద్యోగులు శాశ్వతం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్న వారిపై.. తర్వాత వచ్చే ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించలేం. ఏ ప్రభుత్వం ఉంటే… ఆ ప్రభుత్వానికి బద్దుడిగా ఉండటం ఉద్యోగి లక్షణం. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించలేకపోవడం వల్లే సమస్య వస్తోంది