వైసీపీ ప్రభుత్వ తొమ్మిది నెలల పాలన “నవమోసాల పాలన”గా చెబుతూ టీడీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు చేసినా.. నేరుగా ఓ భారీ ప్రణాళికతో మొదటి సారి ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా చైతన్య యాత్రను… బుధవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో తొలి రోజు చంద్రబాబు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఎన్నో చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 9 నెలల కాలంలో ప్రజలను తొమ్మిది రకాలుగా మోసం చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఓటేసిన వారు కూడా పశ్చాత్తాపం పడుతున్నారని టీడీపీ అంచనాకు వచ్చింది.
టీడీపీ హయాంలో ఉన్న పథకాలను నిలిపివేయడాన్ని హైలెట్ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. ముఖ్యంగా అన్న క్యాంటీన్లు, చంద్రన్నబీమా, ఉచిత ఇసుక, ఆదరణ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై స్ట్రాటజిక్‌గా.. టీడీపీ ప్రచారం చేయబోతోంది. 9 నెలల్లో రూ. 47కోట్లు అప్పులు చేయడమే కాదు.. ప్రజల వద్ద నుంచి రూ. పది వేల కోట్లు వసూలు చేశారని.. లెక్కలు చెబుతోంది. పెట్రోల్, డీజీల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, కరెంట్ చార్జీలు ఇలా ప్రతి అంశంపైనా బాదిన విషయాన్ని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. గతంలో.. ఇసుక కొరత, అమరావతి విషయంలో చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేశారు.
అయితే.. తొలి ప్రభుత్వంపై పూర్తి స్థాయి పోరాటంగా… యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు మాత్రమే కాకుండా.. నియోజవర్గ స్థాయిలో ఈ పర్యటనలు జరగాలని… టీడీపీ హైకమాండ్ ఆదేశించింది. పెద్ద ఎత్తున ప్రభుత్వం పథకాల లబ్దిదారులను తొలగించిందని.. ఆ వ్యతిరేకత ప్రభుత్వంపై మరింత పెరిగేలా చేయడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో అమరావతి, పోలవరాన్ని కూడా ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో చెప్పాలనుకుంటున్నారు.