తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకున్నట్టే! అసెంబ్లీ ఎన్నికల పరాజయ భారంతో అప్పుడే తప్పుకోవాల్సి ఉన్నా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక వరకూ లాక్కుంటూ వచ్చారు. కానీ, సొంత ఇలాఖాలో ఓడిపోయాక పూర్తిగా ఉత్తమ్ చేతులు ఎత్తేశారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎంత త్వరగా జరిగితే, తనకు అంత మనశ్శాంతి అన్నట్టుగా సన్నిహితులతో వాపోతున్నట్టు కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. కొత్తవారు వచ్చేవరకూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాల్సి ఉన్నా… ఇప్పటికే ఆ బాధ్యతల నుంచి తప్పేసుకున్నారు ఉత్తమ్. గడచిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన బాధ్యతాయుతంగా పార్టీని నడిపించలేదన్న విమర్శలున్నాయి. అయితే, హైకమాండ్ దృష్టిలో ఉత్తమ్ ఇంకా క్రియాశీలంగా ఉన్నారనే ఉందట!
ఈ మధ్య పార్లమెంటు ఆవరణలో రాహుల్ గాంధీకి ఉత్తమ్ ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఉత్తమ్ జీ అని రాహుల్ ప్రశ్నించారు. పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి అన్నారు. దీంతో ఉత్తమ్… మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి, కొంత సమయం ఇవ్వండి అన్నారట. ఆ తరువాత, రాహుల్ తో మాట్లాడుతూ… పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంలో విఫలమైయ్యామనీ, అయితే తెరాసకు ధీటైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిలబెట్టామన్నారని సమాచారం. రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోతున్న దశలో మూడు ఎంపీ స్థానాలను గెలిపించానని ఉత్తమ్ చెప్పినట్టు తెలిసింది. పార్టీ పరిస్థితి చెప్పమంటే, తాను పార్టీకి చేసిన సేవల గురించి ఉత్తమ్ ఇలా చెప్తున్నారేంటని రాహుల్ కాస్త ఆశ్చర్యపోయారని సమాచారం.
ఈ మధ్య వరుసగా ఉత్తమ్ మీద వీహెచ్ లాంటి నేతలు హైకమాండ్ కి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రశ్నించారనీ, ఈ గొడవల్ని చక్కదిద్దారా అనేది రాహుల్ అంతరంగమనీ… అయితే ఇదే విషయం ఉత్తమ్ కి తెలిసినా… బాధ్యతల నుంచి తప్పుకోబోయేముందు ఈ అంశాలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణిలోనే రాహుల్ తో ఉత్తమ్ అలా మాట్లాడారనీ అనుకోవచ్చు. ఏదేమైనా, వీలైనంత త్వరగా తప్పుకోవాలన్న ఆతృత ఆయనలో కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే కొందరు అంటున్నారు.