తెలంగాణకు కేంద్రం చేసిందేం లేదని తెరాస, చాలా చేశామంటూ భాజపా… ఈ రెండు పార్టీలూ తూ కిత్తా మే కిత్తా అంటూ ఈ మధ్య ప్రతీ అంశంలోనూ విమర్శలు చేసుకుంటున్నాయి. కేంద్రం ఇవ్వాల్సిన లెక్కలు తీస్తామని రాష్ట్రం అంటుంటే, రాష్ట్రానికి ఇచ్చిన లెక్కలు చెప్తామంటూ భాజపా నేతలూ సవాళ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర కేటాయింపులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కేంద్రమంత్రి పీయూష్ ఘోయల్ తో కలిసి ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కుమార్తె కవితను ఓడించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి గట్టి సంకేతాలిచ్చారన్నారు. రాష్ట్రంలో పార్టీ వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టామన్నారు.
ఇక్కడి ప్రజలకు రైల్వే ప్రయాణం అంటే అలవాటు లేదనీ, రైలు అంటే వాళ్లకి తెలీదనీ, ఎర్రబస్సు తప్ప తెలంగాణలో రైల్వే సర్వీసులు లేవన్నారు కిషన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిందనీ, ఆ తరువాత తెలంగాణలో కొత్త రైళ్లను ప్రారంభించామన్నారు. మోడీ హయాంలోనే రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం వైఫై ద్వారా అందిస్తున్నామన్నారు. భాజపా పాలన వల్లనే రాష్ట్రంలో ప్రజలకు రైల్వే సౌకర్యం వచ్చిందన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాటలు ఒకింత ఇబ్బందికరంగానే ఉన్నాయంటూ విమర్శలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఎర్రబస్సు తప్ప రైల్వే ప్రయాణం ఇక్కడి ప్రజలకు తెలీదని అనడం ఒకెత్తు అయితే, భాజపా ఢిల్లీలో అధికారంలోకి వచ్చేవరకూ తెలంగాణలో రైళ్లే లేవనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించడం మరింత విడ్డూరంగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తమ హయాంలో మాత్రమే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అని ప్రజలకు చెప్పుకోవాలన్న ఆతృత్తలో ఇలాంటి అర్థం వచ్చేలా కిషన్ రెడ్డి మాట్లాడి ఉండొచ్చు!