తెలంగాణ రాష్ట్ర సమితిలో కొందరు నాయకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్నికలకు ముందు కొందరు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి కొందరు, కొన్ని సంవత్సరాలుగా ఉన్న పార్టీని వదిలి ఇంకొందరు గంపెడాశలతో ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వారంతా తమను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదరిస్తారని, అక్కున చేర్చుకుని ఏదో ఒక పదవి ఇస్తారని అనుకున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాని ఏ ఒక్కరికి ఎలాంటి పదవి రావడం లేదు సరి కదా… కనీసం వారితో మాట్లాడే వారే కనిపించడం లేదని వారంతాసన్నిహితుల వద్ద వాపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వర రావు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన అంతకు ముందు మంత్రిగా చేశారు. ఈ ఓటమి తర్వాత ఆయనను పార్టీలో ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల ఓ సమావేశంలో తన అసంత్రప్తిని వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడని పేరు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో చేరారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటి పోతున్నా మండవ వెంకటేశ్వర రావుకు ఎలాంటి పదవి రాలేదు సరి కదా ఆయనతో కేసీఆర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెబుతున్నారు. దీంతో కినుక వహించిన మండవ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడడడం లేదని చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తన సొంతపార్టీ అని భావించిన కాంగ్రెస్ ను వదిలి ఎన్నికలకు ముందు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. సురేష్ రెడ్డి చేరిక సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ ఆయనను కడుపులో పెట్టుకుంటానని, తగిన రీతిలో గౌరవిస్తామని చెప్పారు. అయితే ఈయనకు కూడా పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఇక గత ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఆయన ప్రగతి భవన్ కు రావాలని, ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన మొర ఆలకించే వారే లేరంటున్నారు. అలాగే మాజీ స్పీకర్ మధు సూదనాచారి పరిస్థితి కూడా ఉందంటున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్ గా పని చేసిన ఆయన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నేటి వరకూ సీఎం కేసీఆర్ ను కలవాలని చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదని చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్శింహా రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పార్టీ కార్యాలయానికి వెళ్లినా అక్కడ ఆయనను పలకరించే వారే కరవయ్యారంటున్నారు. గత ఎన్నికల్లో తనకు కాకున్నా తన అల్లునికి టిక్కట్ ఇవ్వాలని నాయిని కోరారు. ఆ కోరికను కనీసం పట్టించుకోకపోగా ఆయనను కలిసేందుకు, మాట్లాడేందుకు కూడా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సముఖత చూపడం లేదని అంటున్నారు. ఇలా పార్టీలో అనేక మంది సీనియర్ నాయకులు అటు పదవులు రాక, ఇటు తమను పిలిచి మాట్లాడే వారు కూడా లేక లోలోపల కుమిలిపోతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.