తన ఆదేశాలను ఉల్లంఘించిన మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని… గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఫిర్యాదు చేశారు. మొత్తం సెలక్ట్ కమిటీల వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై… నాలుగు పేజీల లేఖను గవర్నర్‌కు షరీఫ్ అందచేశారు. మండలి చైర్మన్ నిర్ణయాన్ని కార్యదర్శి ధిక్కరించడం ఇంత వరకూ ఎక్కడా లేదని.. షరీఫ్ చెబుతున్నారు. గవర్నర్‌కు ఇచ్చిన నాలుగు పేజీల లేఖలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్.. శాసనమండలి చైర్మన్ కు ఉన్న అధికారాలతో పాటు…. మండలి కార్యదర్శి చేసిన ధిక్కారం.. ఎంత తీవ్రమైనదో కూడా..షరీఫ్ లేఖలో వివరించినట్లుగా తెలుస్తోంది. మండలి కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను తొలగించి… కొత్త వ్యక్తిని నియమించాలని కోరినట్లుగా తెలుస్తోంది.
వాస్తవానికి మండలి కార్యదర్శిని నియమించేది గవర్నరే. అయితే ప్రభుత్వ సిఫార్సు మేరకే ఈ నియామకం ఉంటుంది. ఇప్పుడు.. మండలి చైర్మన్ .. మండలి కార్యదర్శిని తొలగించాలని.. సిఫార్సు చేయడం.. అసాధారణమే. మండలిలో పరిస్థితులు కూడా అసాధారణంగానే ఉన్నాయి. ఉభయసభలకు.. బాలకృష్ణమాచార్యులు… కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు.. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని.. గవర్నర్.. ఆయనపై వేటు వేస్తే.. రెండు సభల కార్యదర్శిగా ఆయనపై వేటు పడే అవకాశం ఉంది. ఒక చోట నిబంధనలు ఉల్లంఘించి.. శిక్షకు గురైన వ్యక్తి.. అలాంటి హోదాలో మరో చోట పని చేసే అవకాశం ఉండటం విమర్శలకు తావిస్తుంది.
అయితే.. ఈ అంశంపై గవర్నర్ స్పందన ఎలా ఉంటుందున్నది మాత్రం అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. గవర్నర్ స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా ప్రభుత్వ సిఫార్సులు మాత్రమే.. ఆయన ఆమోదిస్తూ ఉంటారు. సొంతంగా నిర్ణయం తీసుకుంటే… పాలనలో జోక్యం చేసుకోవడం అనే విమర్శలు వస్తాయి. కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు.. ఇలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. మరి ఈ విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… ముందడుగు వేస్తారో… లేదో చూడాలి. ఒక వేళ గవర్నర్ చర్య తీసుకోకపోతే.. శాసనమండలి సమావేశాల్లో మండలి ధిక్కరణ కింద.. ఆయనపై చర్యలు తీసుకోవచ్చు..కానీ అమలు చేయాల్సింది ప్రభుత్వమే కాబట్టి… అక్కడా వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే గవర్నర్ ద్వారాచర్య తీసుకుంటే తిరుగుండదని భావిస్తున్నారు.