టైటిల్ వివాదాలు చిత్రసీమకు కొత్త కాదు. సినిమాలో విషయం ఉన్నా, లేకున్నా – టైటిల్ పట్టుకుని వివాదాలు సృష్టించేస్తుంటారు కొంతమంది. ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయ్’ అన్న కార్డు పట్టుకుని రచ్చ రచ్చ చేస్తారు. మొన్నటికి మొన్న `వాల్మీకి`కి ఇదే సమస్య ఎదురైంది. ఆ పేరుని ‘గద్దలకొండ గణేష్’గా మార్చేంత వరకూ ఎవరూ నిద్రపోలేదు. ఆఖరికి పేరు మార్చాల్సివచ్చింది.
ఇప్పుడు ఇదే సమస్య ‘భీష్మ’కు కూడా పట్టుకుంది. భీష్ముడు అజాన్మ బ్రహ్మచారి అని, తన పేరు పెట్టి ఓ సినిమా తీసి, అందులో హీరో క్యారెక్టర్ని అమ్మాయిల వెంట పడేవాడిగా, లవర్‌బోయ్‌గా చిత్రీకరించడం ఏమిటని ఓ వర్గం ప్రశ్నిస్తోంది. ఈ టైటిల్ మార్చాల్సిందే అని, లేదంటే ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కానివ్వం అని హెచ్చరిస్తోంది. అయితే ఓ సినిమా విడుదలకు ముందు ఇలాంటి సమస్యలు ఎదురవ్వడం మామూలే. కాకపోతే సినిమా మరి కొద్ది గంటల్లో విడుదల అవుతున్నప్పుడు నిర్మాతల దృష్టి లావాదేవీలపై ఉంటుంది. సినిమా భవిష్యత్తేమిటో అనే కంగారులో ఉంటారు. అలాంటిసమయంలో చూసి చూసి.. వివాదాలు సృష్టిస్తుంటారు కొంతమంది. భీష్మ టైటిల్ ఇప్పుడు ప్రకటించలేదు. సినిమా మొదలెట్టేటప్పుడే భీష్మ టైటిల్ ఎనౌన్స్ చేశారు. అప్పుడు చేయని రచ్చ ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్టో..? ‘రాముడు’ అనే టైటిల్‌తో వచ్చిన సినిమాల్లో హీరో ని ఏక పత్నీవ్రతుడుగానే చూపించాలా?? ఆ హీరోతో డ్యూయెట్లు పాడించలేదా? ఇలాగైతే.. సినిమా టైటిళ్లు పెట్టడం కష్టమే.