గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె.. ఇలా క్రిష్ ఏ సినిమా కథ ఎంచుకున్నా, అందులో ఓ సామాజిక కోణం ఉంటుంది. సమాజానికి ఏదో చెప్పాలన్న తపన కనిపిస్తుంది. ఇప్పుడున్న దర్శకులలో క్రిష్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది అదే. అయితే క్రిష్ కమర్షియాలిటీని మర్చిపోయాడని, తనకు వాణిజ్య విలువలతో సినిమా తీయడం చేతకాలేదన్న విమర్శలూ వినిపించాయి. అది నిజం కూడా. క్రిష్ ఎప్పుడూ ఓ కమర్షియల్ కోణంలో కథని ఆలోచించలేకపోయాడు. అందుకే క్రిష్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర భారీ విజయాల్ని నమోదు చేయలేకపోయాయి. అవార్డు సినిమాలు ఇచ్చినా, ఆర్థికపరమైన సంతృప్తి మాత్రం దక్కలేదు.
అయితే ఈసారి క్రిష్ తన పంథా పూర్తిగా మార్చేశాడు. పవన్ సినిమా కోసం. పవన్ – క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే.. ఈసారి కూడా సామాజిక ఇతివృత్తంతోనే, క్రిష్ పంథాలోనే సినిమా రాబోతోందని అనుకున్నారు. అయితే ఈసారి క్రిష్ తన పంథా మార్చేశాడు. పవన్‌తో సినిమా పూర్తి కమర్షియల్ కోణంలో సాగబోతోంది. ఇందులో స్పీచులు లేవు. సామాజిక అంశాలు లేవు. ఓ మాస్ హీరోని ఎలాంటి కథలో చూపించాలని దర్శకులు అనుకుంటారో, ఎలాంటి పాత్రలో చూడాలని అభిమానులు ఆశిస్తారో, సరిగ్గా అలాంటి పాత్రలో, అలాంటి కథలో క్రిష్ పవన్‌ని చూపించబోతున్నాడు. ప్రతీ కమర్షియల్ సినిమాలోనూ.. మాస్‌ని మెప్పించేందుకు కనీసం నాలుగైదు ఎపిసోడ్లు ఉంటాయి. అలాంటి ఎపిసోడ్లని అడుగడుగునా ప్లాన్ చేశాడట క్రిష్. పవన్‌లో హీరోయిజం.. ఈ సినిమాలో మరో రూపంలో కనిపించబోతోందని, క్రిష్ ఓ కమర్షియల్ కథని ఎలా టేకప్చేయగలడో ఈ సినిమా ద్వారా అర్థం కానున్నదని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిష్‌పై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువ. వాటి లక్షణాలు, క్వాలిటీ, ప్రజెంటేషన్ ఈ సినిమాలో చూసే అవకాశాలున్నాయి.