విశాఖలో రూ.70వేల కోట్లతో పెట్టాలనుకున్న ఆదాని డేటా సెంటర్… కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు తరలిపోయింది. కాపులుప్పాడ ప్రాంతంలో ఆదాని డేటా సెంటర్కు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. శంకుస్థాపన కూడా చేసింది. కొన్ని వేల ఉద్యోగాలు.. ఆ డేటా సెంటర్ వల్ల వస్తాయని.. విశాఖ డేటా టెక్నాలజీకి కేంద్రంగా ఎదుగుతందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత .. ఆదాని అనూహ్యంగా.. మనసు మార్చుకుంది. ఆ ప్రాజెక్ట్ను.. హైదరాబాద్కు తరలించింది. ప్రభుత్వం వివిధ అంశాల్లో… ఆదాని కంపెనీకి ఇబ్బందులు పెట్టడం వల్లే.. వెళ్లిపోయిందన్న ప్రచారం జరిగింది. దీన్ని పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి ఖండిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆదాని వెళ్లిపోయిందని..అధికారికంగా ఎప్పుడూ చెప్పని మంత్రి గౌతంరెడ్డి.. మొదటి సారి.. ఆ పరిశ్రమ వెళ్లిపోయిందని.. విశాఖలో తేల్చేశారు. విశాఖలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. విశాఖ నుంతి ఆదాని వెళ్లిపోవడానికి కారణం ప్రభుత్వం కాదన్నారు. ఆదానికి ఉన్న అననుకూలతల వల్లే వెళ్లిపోయిందని కొత్త కారణం చెప్పారు. ఆదాని వెళ్లిపోవడానికి ప్రభుత్వం కారణమని జరుగుతున్న ప్రచారం దురదృష్టకరమన్నారు. ఆదాని కంపెనీ..ఆషామాషీగా రూ. 70వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాదని.. అంటున్నారు.
డేటా సెంటర్ కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటం వల్లే విశాఖ కు వచ్చిందని.. భూములు కేటాయించిన తర్వాత శంకుస్థాపన పూర్తి చేసిన తర్వాత ..మంత్రి చెప్పినట్లుగా అనుకూలంగా లేదని ఎలా గుర్తిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గౌతంరెడ్డి మాత్రం.. ఆదాని డేటా లేకపోయినా.. వచ్చే ఏడాది కల్లా.. ఒక్క విశాఖలోనే యాభై వేల ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిలీనియం టవర్స్ లో సచివాలయం రాదని.. రెండో టవర్ ని కూడా ఐటీ కంపెనీల కోసమే అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు.