హైదరాబాద్: గత పదిరోజులుగా రిజర్వేషన్ల అంశంపై కాపు సామాజికవర్గం ఉద్యమబాట పట్టటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అట్టుడకటం తెలిసిందే. చంద్రబాబు నాయుడు చతురతో, కాపు ఉద్యమనేతలలో అస్పష్టతో తెలియదుగానీ ఎట్టకేలకు ఆ సమస్య ఎట్టకేలకు నిన్న పరిష్కారమయింది. అయితే ఇప్పుడు మాదిగలు ఉద్యమం మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 30న విజయవాడ సమీపంలో 100 ఎకరాల స్థలంలో పదిలక్షల మందితో విశ్వరూప మానవ మహాసభ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెబుతున్నారు. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ చేయిస్తామని చంద్రబాబు 20 ఏళ్ళనుంచి చెబుతూ వస్తున్నారని దుయ్యబట్టారు. మాదిగల ఓట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, నేటివరకు వర్గీకరణ చేయలేదని, అలాంటి వ్యక్తి బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఏవిధంగా రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి అండగా మాదిగ సోదరులు నిలబడిన విషయాన్ని మరచిన చంద్రబాబు ఏ 1 విశ్వాసఘాతకుడని మండిపడ్డారు. దళితులను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని మంద కృష్ణ చెప్పారు.