కొడంగల్… ఈ పేరు వినగానే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గం అని గుర్తొస్తుంది. వాస్తవానికి, ఆయన సొంత ప్రాంతం కాకపోయినా, వరుసగా రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన అక్కడి నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఆ తరువాత, ఆయనకి మల్కాజ్ గిరి ఎంపీగా అనూహ్యంగా అవకాశం రావడంతో గెలిచారు. దీంతో ఆయన ఎక్కువగా మల్కాజ్ గిరికి పరిమితం కావాల్సి వస్తోంది. గడచిన మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఆయన కొడంగల్ కి సమయం కేటాయించలేకపోయారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న కథనం ఏంటంటే… ఇకపై రేవంత్ రెడ్డి కొడంగల్ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటారని! దానికి అనుగుణంగానే దశలవారీగా అక్కడి పార్టీ బాధ్యతల్ని సోదరుడికి అప్పగిస్తున్నట్టు సమాచారం.
కొడంగల్ వదులుకుంటే, ఎమ్మెల్యేగా ఆయన ఎక్కడి నుంచి భవిష్యత్తులో పోటీ చేస్తారు..? ఆ ప్రయత్నం కూడా రేవంత్ మొదలుపెట్టేశారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇటీవలే ఆయన మల్కాజ్ గిరి పరిధిలో సొంత ఆఫీస్ తీసుకున్నారు. ఎంపీగా గెలిచిన తరువాత ఈ పార్లమెంటు నియోజక వర్గంలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ సానుభూతిపరులు ఉండటం, సొంత సామాజిక వర్గం జనాభా కూడా ఎక్కువగా ఉండటంతో రేవంత్ ని అభిమానించేవారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. దీంతో, మల్కాజ్ గిరి పరిధిలో ఏదో ఒక శాసన సభ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకునే ఆలోచనలో రేవంత్ ఉన్నారని అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల్ని విశ్లేషించుకుంటే… ఎల్బీ నగర్, ఉప్పల్ శాసన సభ నియోజక వర్గాల నుంచి రేవంత్ రెడ్డికి భారీగా ఓట్లు పడ్డాయి. ఈ రెంటిలో ఏదో ఒకటి నిర్ణయించుకుని… ఇప్పట్నుంచే ఆ ప్రాంతంపై రేవంత్ ఫుల్ ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి, కొడంగల్ లో ఇప్పుడు తెరాస బలమైన శక్తిగా ఎదిగింది. రేవంత్ ని ఎలాగైనా ఓడించి తీరాలనే ఉద్దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి ఫోకస్ పెట్టారు. ఆ తరువాత, అక్కడి రెండు మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. నాలుగు జెడ్పీలు, ఎంపీటీసీలు గెలిపించుకుని తెరాస క్షేత్రస్థాయిలో బలపడింది. తెరాస కంచుకోటగా మార్చుకునే పనిలో ఉంది. ఈ పరిస్థితి మార్చాలనే ఆలోచనతో అక్కడ తెరాసకు ధీటుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమే. కాబట్టి, ఆదరణ ఉన్న చోటే ప్రయత్నాలు చేసుకోవడం మేలు! ఇప్పుడు రేవంత్ వ్యూహం అదే అనొచ్చు.