తెలంగాణలో వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల వేట ప్రారంభించింది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలలో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ సంఖ్యాబలం అనుసరించి ఈ రెండు స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితికే దక్కుతాయి. దీంతో రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. శాసనసభ ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న వారికి ఈసారి రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే ఇద్దరిలో ఒక స్థానాన్ని కళాకారుడితో కానీ మేథావి వర్గం నుంచి కానీ ఎంపిక చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. గత కొంత కాలంగా ఈ రెండు వర్గాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కళాకారులు, మేథావులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఆ సమయంలో కళాకారులకు, మేథావులకు సముచిత న్యాయం చేస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను రాజ్యసభకు పంపిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ కు, కోదండరామ్ కు మధ్య మనస్పర్ధలు రావడంతో కోదండరామ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. అప్పటి నుంచి మేధావి వర్గంతో కేసీఆర్ కు సరిపడడం లేదు. అలాగే కళాకారులు కూడా కేసీఆర్ తమను నిర్లక్ష్యం చేశారని ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో రెండు వర్గాలకు దగ్గర కావాలంటే వారిలో ఎవరో ఒకరిని రాజ్య సభకు పంపించి ఆ రెండు వర్గాలను తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. గతంలో సీనీ గీత రచయిత డాక్టర్ సీ.నారాయణ రెడ్డి మాత్రమే రాజ్యసభకు వెళ్లారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ కళాకారుల నుంచి ఎవ్వరూ పెద్దల సభకు వెళ్లలేదు. తెలంగాణలో అన్ని వర్గాల వారిని మెప్పించే కళాకారుడ్ని కాని, మేథావిని కాని ఎంపిక చేసి రాజ్యసభకు పంపాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా తనకు ఆ రెండు వర్గాల పట్ల ఎలాంటి గౌరవం ఉందో తెలంగాణ సమాజానికి తెలియజేయాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను తనకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు అప్పగించినట్లు సమాచారం.