పారిశ్రామిక రంగం. ఏ రాష్ట్రం అభివ్రద్ధి చెందాలన్నా ఈ రంగానిదే కీలక పాత్ర. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిశ్రమల ఆధారంగానే ఆ రాష్ట్ర ప్రగతిని అంచనా వేస్తారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కాని, స్ధానికంగా ఉపాధి అవకాశాలు కాని పెరగాలంటే పరిశ్రమలకే పెద్ద పీట. అలాంటి పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడం, దాని ద్వారా రాష్ట్ర సమగ్రాభివ్రద్ధిని సాధించడం ఏ ప్రభుత్వమైనా చేసే పని. ఇంతటి కీలకమైన పరిశ్రమల రంగం తెలంగాణలో దూసుకుపోతోంది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహికులు ఎవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోగా పారిశ్రామికవేత్తలకు కల్సిస్తున్న సౌకర్యాలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు దోహదపడుతున్నాయని అంటున్నారు. ఇటీవల దావోస్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు తెలంగాణలో ఉన్న వసతులపై సదస్సుకు హాజరైన వారికి పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మంచి ఫలితాలు ఇస్తోందంటున్నారు. ఇక రెండు రోజుల క్రితం జరిగిన బయో ఆసియా 17 వ సదస్సులో కూడా ఇక్కడ పారిశ్రామికవేత్తలకు అందజేస్తున్న సదుపాయాలపై వివరణాత్మకంగా చెప్పారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఎగుమతి అయ్యేలా చేస్తామని ప్రకటించారు. అలాగే జీనోమ్ వ్యాలీ విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి 100 మిలియన్ డాలర్ల వ్యాక్సిన్ ఉత్సత్తులే తమ లక్ష్యమని వివరించారు. ఈ సదస్సు సూపర్ హిట్ అయ్యిందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఇక ఐటీ రంగం కూడా నానాటికీ పెరుగుతోంది. కొత్త కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత పరిశ్రమల రంగం వెనకబడిందనే విమర్శలు వస్తున్నాయి. ఆదానీ గ్రూప్ తనంతట తానుగా వెళ్లిపోయిందని ఏకంగా మంత్రులే ప్రకటిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల కాలంలో కొత్తగా ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు కాని, ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్న దాఖలాలు కాని లేవని చెబుతున్నారు. మరోవైపు అనంతపురంలో ఏర్పాటైన కియా పరిశ్రమ తరలిపోతోందంటూ ఓ ప్రచారం జరిగింది. అయితే తాము ఎక్కడికి వెళ్లడం లేదని కియా పరిశ్రమ యాజమాన్యం ప్రకటించినా… ఆ ప్రచారం ప్రభావం మాత్రం పారిశ్రామిక రంగంపై తీవ్రంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాభివ్రద్ధిలో కీలకమైన పరిశ్రమల రంగం తెలంగాణలో మూడు పువ్వులు… ఆరు కాయలుగా విరాజిల్లుతూంటే… ఏపీలో మాత్రం వెలవెలబోతోందని ఆ వర్గాలు చెబుతున్నాయి.