వచ్చే నెల 15న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆరోజున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్. ఇంతకీ ఈ సభ ఎందుకంటే… సీఏఏకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై తెరాస, మజ్లిస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయనీ, మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నారనీ, ఒవైసీకి కేసీఆర్ మోకరిల్లి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. అందుకే, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బిల్లు దేశంలో ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టేది కానేకాదని చాటి చెప్పడమే అమిత్ షా సభ ఏర్పాటు వెనకున్న ఉద్దేశం అన్నారు. ఈ సభకు జాతీయవాదులు అందరూ వస్తారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా ఆహ్వానిస్తామన్నారు లక్ష్మణ్.
జాతీయ స్థాయిలో చర్చనీయమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం తెలంగాణ నుంచే ఈ మధ్య భాజపా చేస్తూ ఉంది. ఈ మధ్యనే, కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై విమర్శలు వస్తే… అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సీఏఏ మీద అవగాహన కల్పించే కార్యక్రమాలు ఇక్కడ్నుంచే ప్రారంభిస్తున్నట్టు లక్ష్మణ్ ప్రకటించారు.
అమిత్ షా సభను ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రంగా విమర్శలు దాడి చేసే అవకాశంగా భాజపా మార్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే, ఈ మధ్య కేంద్రం మీద కేసీఆర్ చాలా విమర్శలు చేస్తున్నారు కదా. ఈ సభకి పవన్ కల్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆయన సేవల్ని వినియోగించుకుంటామంటూ భాజపా నేతలు ఈ మధ్యే ప్రకటించారు. పవన్ హాజరైతే ఆ సభకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తెలంగాణలో ఆయన ఈ మధ్య సభలేవీ పెట్టలేదు. పవన్ అభిమానులు ఇక్కడా పెద్ద సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి, ఆయన్ని రప్పించుకునే ప్రయత్నమే భాజపా కచ్చితంగా చేస్తుంది.