తెలంగాణ భాజపాకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తవుతుంది అనే కథనాలు ఈ మధ్య వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ని కొనసాగిస్తారని కాసేపు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని కాసేపు… ఇలా ఈ మధ్య భాజపాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణతోపాటు, ఆంధ్రా భాజపా వర్గాల్లో చర్చనీయం అయింది.
రెండు తెలుగు రాష్ట్రాల భాజపా శాఖలకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారంటూ మొన్ననే ఆయన వ్యాఖ్యానించారు. దీంతో లక్ష్మణ్, కన్నా లక్ష్మీనారాయణ మార్పు తప్పదా అనే కథనాలు చక్కర్లు కొట్టాయి. రెండు రాష్ట్రాలకీ కొత్తవారంటే ఎవరూ అనే చర్చా నడిచింది. విద్యాసాగర్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ భాజపా వర్గాల్లో ఓ రోజంతా ఇదే చర్చ జరిగింది. ఆయనకి ఢిల్లీ నుంచి పక్కా సమాచారం ఉండబట్టే ఇలాంటి లీకులు ఇస్తున్నారా అనే అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే, శుక్రవారం నాడు ఇదే అంశమై మరోసారి స్పందిస్తూ… ఆ ముందురోజు తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా మాట్లాడారు.
రాష్ట్ర అధ్యక్షులను నియమించేది తాను కాదనీ, జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని విద్యాసాగర్ వివరణ ఇచ్చారు. తాను నిర్ణయించలేనని అన్నారు. అంతేకాదు, తెలంగాణ భాజపా అధ్యక్ష రేసులో తాను లేనన్నారు. ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాననీ, తనకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి అవసరం లేదన్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించినా ఆశ్చర్యం లేదనీ, అలా చేసినా సాంకేతికంగా వారు కొత్త అధ్యక్షులు అవుతారు కదా అని అభిప్రాయపడ్డారు. కన్నా, లక్ష్మణ్ పోస్టుల్లో ఎలాంటి మార్పూ ఉండదని ఇవాళ్ల చెప్పినట్టు..! అయితే, విద్యాసాగర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని సులువుగా తీసిపారేసినట్టు మాట్లాడారు! నిజానికి, గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న తరువాత పార్టీపరంగా మరోసారి క్రియాశీలం అయ్యేందుకు విద్యాసాగర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ ఇలా వ్యాఖ్యానించడమూ విశేషమే!