ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైరయ్యే వరకూ.. సెలవులోనే ఉండాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉదారత చూపుతోంది. ఆయనను సీఎస్‌గా తొలగించినప్పటి నుంటి లీవ్‌లోనే ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది. తాజాగా.. ఆయనకు మరో నెల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ.. సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అఫీసర్ అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం షెడ్యూల్ ప్రకారం… వచ్చే ఏప్రిల్‌లో రిటైర్ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ అయిన ఎల్వీ …చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతారని అంతా అనుకున్న సమయంలోనే.. కథ అడ్డం తిరిగింది.
చంద్రబాబు హయంలో ఆయన సీనియర్ అయినప్పటికీ.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉండటంతో.. ఆయన పేరును చీఫ్ సెక్రటరీ పదవికి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కోపమో ఏమో కానీ.. ఎన్నికల సమయంలో… అప్పటి సీఎస్ ను తొలగించిన ఈసీ… అత్యంత సీనియర్ ఎయిన ఎల్వీకి చాన్సిచ్చింది. ఆ సమయంలో ఆయన .. టీడీపీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత .. జగన్ ఆయననే సీఎస్ గా కొనసాగించారు. రిటైరయ్యే వరకూ.. సీఎస్‌గా ఉంటారని.. జగన్ భరోసా ఇచ్చారని మీడియాలో ప్రచారం జరిగింది. అధికారం చేపట్టిన మొదట్లో.. ఎల్వీ అన్న… సవాంగ్ అన్న.. తనను గైడ్ చేస్తారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. కానీ పరిస్థితులు అంత సానుకూలంగా గడవలేదు.
మధ్యలో జగన్మోహన్ రెడ్డితో విబేధాలు రావడం.. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. సీఎంవోలోకి వచ్చిన తర్వాత సీఎస్ మాటలకు విలువ లేకుండా పోవడంతో… మనస్థాపానికి గురయ్యారు. ఈ అంశంలో జగన్ ఆదేశాలను పాటించలేదన్న కారణంగా ఆయనపై వేటు వేశారు. విధులు.. నిధులు ఉండని పోస్టుకు బదిలీ చేశారు. అది అవమానకరమైన గెంటివేత కావడంతో… ఎల్వీ సెలవు పెట్టారు. ఆ తర్వాత సెలవు అలా కొనసాగిస్తున్నారు. సెలవు మంజూరు చేయకపోతే ఇదో పెద్ద విషయం అవుతుందని అనుకున్నారేమో కానీ.. ప్రభుత్వం కూడా రిటైరయ్యే వరకూ సెలవు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఎల్వీకి రిటైర్మెంట్ వీడ్కోలు కూడా గొప్పగా లభించే అవకాశం లేదని.. అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.