ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంపై.. . తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇది కక్ష సాధింపు చర్యేనని అంటోంది. తొమ్మిది నెలల కాలంలో ఏ ఒక్క అవినీతిని వెలికి తీయకపోయినప్పటికీ.. సిట్ వేసి… విచారణల పేరుతో… టీడీపీ నేతల్ని పిలిపించి.. దుష్ప్రచారం చేసే రాజకీయ గేమ్ అని.. టీడీపీ ఆరోపిస్తోంది. అయితే.. టీడీపీ నేతల వాదనలు.. మరీ అతిశయోక్తిగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అది ప్రభుత్వానికి ఉన్న అధికారం. దాని వెనుక ఉన్నది కక్ష సాధింపో.. లేకపోతే.. అవినీతి వెలికి తీయడమో.. ఏదైనా కావొచ్చు. కానీ.. అసలు నిర్ణయమే తప్పు అన్నట్లుగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ సిట్ పై కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మాత్రం వారు ఎత్తి చూపలేకపోతున్నారు.
సిట్‌లో అందరూ పోలీసు అధికారులే ఉన్నారు… సాధారణంగా..గత ప్రభుత్వంలో నిర్ణయాలన్నింటినీ బయటకు తీయాలంటే… అన్ని రంగాల నిపుణులు ఉండాలి. కానీ సిట్ లో పోలీసులు మాత్రమే ఉన్నారు. సిట్ కు పోలీసు స్టేషన్ హోదా ఇచ్చారు. అంటే.. . మంత్రివర్గం ఉపసంఘం తేల్చిన విషయాలపై ఈ సిట్ చర్యలు తీసుకుంటుంది. అంటే.. దాదాపుగా పరిశోధన ఏమీ ఉండదని… మంత్రుల కమిటీ చెప్పింది కాబట్టి వాటిపై చర్యలు మాత్రమే తీసుకుంటారని కూడా చెబుతున్నారు. అయితే.. మంత్రుల కమిటీ రిపోర్టులో ఏముందన్నదే ఆసక్తికరం. ఇప్పటికే పీపీఏలు, పోలవరం వంటి అంశాల్లో… అవినీతి జరగలేని కోర్టుల ముందు.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖల ద్వారా తెలియచెప్పాల్సిన పరిస్థితులు గతంలోనే ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్తగా వాటిపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదంటున్నారు.
కేవలం వేధింపుల కోసమే సిట్ అని… టీడీపీ గట్టి నిర్ణయానికి వచ్చింది. అందుకే.. సిట్ విశ్వసనీయతను… ప్రభుత్వ తీరును ప్రధానంగా చర్చల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసు కోసం వరుసగా మూడు, నాలుగు సిట్లను ఏర్పాటు చేసినా… ప్రయోజనం లేకపోయిందని… ఇప్పుడు కొత్త సిట్ల వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తోంది. కావాలంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవిచారణలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. కానీ ఇలాంటి సవాళ్లపై… అధికార పార్టీ స్పందించే అవకాశం లేదు.