భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. క్షేత్రస్ధాయిలో పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోవాలని పార్టీ తెలంగాణ నాయకత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇతర రాష్ట్రాలపై ద్రష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ తెలంగాణపై మరింత శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకులను తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంత్రప్తితో ఉన్న నాయకులను చేరదీయాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికే అనేక మంది పార్టీ అధిష్టానంపై కినుక వహించారు. శాసనసభ ఎన్నికల్లో టిక్కట్లు ఆశించిన వారికి పార్టీ అధిష్టానం అనేక తాయిలాలను ఆశ చూపించింది. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. తెలంగాణలో అనేక నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీ ద్వారా పార్టీలో సీనియర్లను సంత్రప్తి పరుస్తారని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నామినేటెడ్ పదవుల భర్తీని దాదాపుగా గాలికి వదిలేశారు. ఈ దశలో చాలమంది సీనియర్లు పార్టీ పట్ల విముఖంగా ఉన్నారు. అలాంటి వారిని పార్టీలోకి ఆహ్వనించాలని, వారికి కేంద్రమే నామినేటెడ్ పదవులు ఇస్తుందని ఎర వేసి వారిని లాగేయాలని బీజేపీ అధినాయకత్వం తెలంగాణ స్థానిక నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. ఈ పనిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత త్వరగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టవచ్చేనన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. రానున్న మూడున్నరేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంటా పోరాటాలు చేయడంతో పాటు పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలంటే అధికార అసంత్రప్తులను చేరదీయడం ఒక్కటే మార్గమని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఇలా చేయగలిగిన వారికే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.