వారిద్దరికి ఒక్కరే శత్రువు. వారిద్దరికి ఒక్కరే టార్గెట్. వారిద్దరికి ఒక్కరే లక్ష్యం. వారిద్దరికి ఒక్కటే రాజకీయ కక్ష.
ఆ ఇద్దరూ ఎవరో వేరే చెప్పనవసరం లేదు. వారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు. ఇక వీరిద్దరి ప్రధాన శత్రువు… రాజకీయ ప్రత్యర్ధి కూడా ఎవరో చెప్పడానికి పెద్దగా ప్రయత్నించనవసరం లేదు. అవును. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరు మఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పగ దశాబ్దానికి పైగా ఉన్నదే. ఆ పగను, ప్రతికారాన్ని తీర్చుకుందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు నాలుగు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అంతే కాదు…
ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ సీఎంతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాలపై దూకుడుగా వెళ్తున్నారు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని, వాటి నిగ్గు తేలుస్తామంటూ తన మంత్రులు, పార్టీ నాయకుల చేత పదే పదే ప్రకటనలు చేయిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పనిని ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై ఏకంగా సిట్ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం పది మంది సభ్యులతో ఓ బ్రందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాల వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దిశానిర్దేశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో చాణుక్యుని మించి తెలివి తేటలున్న కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తో బాగుంటుందో సలహాలు, సూచనలు చేస్తున్నారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. పాలనలో కొత్త కావడం, ఇద్దరి ఉమ్మడి శత్రువు ఒక్కరే కావడంతో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సంప్రదిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై ఉన్న కోపాన్పి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడ్ని ఇరుకున పెట్టిన కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి తన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారని అంటున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటు అనేది కేసీఆర్ ఇచ్చిన సలహాయేనని అంటున్నారు. ముందు ముందు ఈ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరిన్ని తీవ్ర నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.