మహర్షి లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ 25 సినిమాల చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది మహర్షి. ఈ సినిమాతో వంశీకి ఫిదా అయిపోయాడు మహేష్. దర్శకుడు – హీరో రిలేషన్ షిప్ కంటే ఎక్కువగా వీళ్ల అనుబంధం కొనసాగింది. ఈ సినిమాతో మహేష్ ఇంటి మనిషి అయిపోయాడు వంశీపైడిపల్లి. మహేష్‌తో వరుసగా రెండో సినిమా చేసే ఛాన్స్ రావడం కూడా ఎవరూ ఆశ్చర్యపోలేదు. `సరిలేరు నీకెవ్వరు` తరవాత మహేష్ సినిమా వంశీతోనే అనేది ఆరునెలల క్రిందటే ఫిక్స్ అయ్యింది. అప్పటి నుంచీ అదే పనిలో ఉన్న వంశీ పైడిపల్లి మహేష్‌కి ఓ లైన్ చెప్పి ఓకే అనిపించుకున్నాడు. అది అది కథగా మారేసరికి మాత్రం మహేష్‌కి నచ్చలేదు. దాంతో… తప్పరిసరి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టాల్సివచ్చింది.
మహేష్‌కి దర్శకుడు దొరకడం పెద్ద విషయమేమీ కాదు. తను సై అనాలే గానీ, చాలామంది క్యూలో ఉంటారు. పరశురామ్ తో మహేష్ సినిమా చేసే ఛాన్సుందన్నది టాలీవుడ్ టాక్. మరి వంశీ పైడిపల్లి పరిస్థితే అర్థం కావడం లేదు. తానేమో స్టార్ హీరోల కోసం ఎదురుచూసే రకం. తొలి సినిమానే ప్రభాస్ తో చేసేశాడు. ఎన్టీఆర్, చరణ్, మహేష్, నాగార్జున.. ఇలా స్టార్లతోనే ప్రయాణం చేస్తున్నాడు. తదుపరి సినిమా కూడా స్టార్‌తోనే చేయాలి. అయితే అలాంటి స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. సినిమా సినిమాకీ విపరీతమైన గ్యాప్ తీసుకుంటుంటాడు వంశీ. మహర్షి తరవాత… మహేష్ కోసమే ఇన్నాళ్లూ ఆగాడు. ఇప్పుడు సడన్‌గా మహేష్ సినిమా క్యాన్సిల్ అయ్యేసరికి వంశీ కూడా తేరుకోవడానికి ఇంకొంచెం సమయం తీసుకుంటాడు. మరో కథ రాసుకుని, మరో హీరోని వెదుక్కుని, ఆ సినిమా పట్టాలెక్కించడానికి ఎంత కాదన్నా మరో మూడు నాలుగు నెలలైనా పడుతుంది. కథ రెడీ చేసినా… హీరో అంటూ ఉండాలి కదా. అదే అసలు సిసలు సమస్య. మరి దాన్ని వంశీ ఎలా దాటుకుని వస్తాడో..?