ప్రతిపక్షంతో కాదు.. రాక్షసులతో పోరాడుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో ప్రకటించారు. తాను ఎంతో మంచి పనులు చేస్తున్నా.. అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఒక్క ప్రతిపక్ష పార్టీ మాత్రమే కాదు.. వారికి తోడుగా.. కొన్ని మీడియాలు అసత్యాలు రాసి.. జరగనివి జరిగినట్లుగా చూపిస్తున్నాయని ఆరోపించారు. అవన్నీ అవాస్తవాలేనన్నారు. ముఖ్యమంత్రి.. చెప్పింది.. అసైన్డ్ భూములను తీసుకుని మళ్లీ పేదలకే ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తున్నారని.. పత్రికల్లో వస్తున్న వార్తల గురించి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాతిక లక్షల మందికి ఒకే సారి ఇళ్ల స్థలాలు ఇస్తూంటే.. ఇక చంద్రబాబు గురించి చెప్పుకునేవారు ఎవరూ ఉండరని.. ఆయనకు చెందిన మీడియా… దుష్ప్రచారం చేస్తోందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల కోసం.. గతంలో బడుగు, బలహీనవర్గాల కోసం… ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల… ఆయా భూములు సాగు చేసుకుంటున్నవారు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం.. కలకలం రేపింది. అవి తమ జీవనాధారం అని.. అవి తీసుకుంటే ఎలా అన్న ఆవేదనను వ్యక్తం చేశారు. మీడియాలో ఇవి ప్రముఖంగా వచ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేదని.. ముఖ్యమంత్రి చెబుతున్నారు. మీ అన్నగా.. దేవుడి బిడ్డగా…మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే.. అలాంటి ప్రచారాలను అధిగమించి.. మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటానని ప్రకటించారు.
విజయనగరంలో జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీని ప్రకారం.. ఉన్నత చదువులు చదివే వారికి ఆయా తరగతుల్ని బ ట్టి రూ. పది నుంచి ఇరవై వేల వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే.. అంత మందికీ సాయం చేస్తానని.. తల్లిదండ్రుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని సీఎం ప్రకటించారు. ప్రతిపక్షంతో పాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియాను.. ముఖ్యమంత్రి రాక్షసులతో పోల్చారు.