అమరావతి ఉద్యమంలోకి తెలంగాణ నేతలు వస్తున్నారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని.. అమరావతి జేఏసీ ప్రయత్నాలు ప్రారంభించింది. కేసీఆర్ అపాయింట్ మెంట్ ను కూడా జేఏసీ పెద్దలు కోరారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత కేసీఆర్ లేదా కేటీఆర్ అపాయింట్ మెంట్ లభిస్తుందని జేఏసీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. 29వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోదండరామ్, రేవంత్ రెడ్డిలతో పాటు మాజీ ఎంపీ సబ్బంహరిని కూడా ఆహ్వానించారు.అమరావతి ఉద్యమానికి హైదరాబాద్ లో మద్ధతు లభిస్తుండటంతో కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారని.. జేఏసీ నేతలు భావిస్తున్నారు.
త్వరలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రా సెటిలర్లు హైదరాబాద్ లో ఎక్కువమంది ఉన్నారు. వీరిని తమవైపును తిప్పుకునేందుకు కేసీఆర్ లేదా కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారని భావిస్తున్నారు. మొదట్లో హైదరాబాద్ లో అమరావతి ఉద్యమానికి మద్ధతుగా జరిగిన సభలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అమరావతి జేఏసీ సమావేశాలకు ఆటంకాలు కల్పించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తర్వాత పోలీసులు అమరావతి సమావేశాలకు అనుమతి ఇస్తున్నారు. టీఆర్ఎస్ హైకమాండ్లోనూ… అమరావతి ఉద్యమం బలంగా ఉందన్న అభిప్రాయం ఉంది. కొన్నాళ్ల కిందట కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో ఇదే విషయాన్ని చెప్పారు.
అయితే.. జగన్మోహన్ రెడ్డితో..కేసీఆర్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారంలో ఆయన సలహాలు జగన్ తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారా..అన్న సందేహం కూడా ఉంది. ఒక వేళ అమరావతి జేఏసీకి అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం.. ఏపీ రాజధాని ఉద్యమం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది.