అమరావతి ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలను చాలా గట్టిగానే చేస్తున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలూ మద్దతిస్తూండటంతో… జాతీయ స్థాయి నాయకుల్ని పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తోంది. అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో.. ఏపీ కాంగ్రెస్‌కు కొత్తగా నియమితులైన కార్యవర్గం.. కొత్త పీసీసీ చీఫ్ శైలజానాథ్…అమరావతికి మద్దతుగా తమదైన ముద్రతో ఓ పోరాట ప్రణాళిక ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా… రాహుల్ గాంధీని అమరావతికి తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. తాను వస్తానని భరోసా ఇచ్చారు.
రాహుల్ గాంధీ పర్యటనతో… అమరావతి పోరాటం… జాతీయ స్థాయికి చేరుతుందన్న అభిప్రాయంతో.. ఉద్యమకారులు ఉన్నారు. అందుకే.. వీలైనంత త్వరగా రాహుల్ పర్యటనను ఖరారు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల మధ్యలో రాహుల్ .. రావడం కుదరదన్న అంచనాలో.. ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత.. తొలి వారంలోనే పర్యటన ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీని కోసం అమరావతి జేఏసీతో కాంగ్రెస్ నేతలు సమన్వయం చేసుకునే అవకాశం ఉంది.
ఒకటో తేదీన అమరావతి జేఏసీ ఢిల్లీ పర్యటనకు వెళ్తోంది. మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం.. గతంలో వీరు ప్రయత్నించారు. ఆ అపాయింట్మెంట్ల విషయంలో… పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. కదలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. మోదీ, అమిత్ షాలకు ఉన్న వెసులుబాటుని బట్టి… సమయం ఇవ్వొచ్చన్న సమాచారం రావడంతో.. వారు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడే రాహుల్ గాంధీని కూడా కలిసి.. లాంఛనంగా.. అమరావతికి రావాలని ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. రాహుల్ గాంధీ అమరావతి పర్యటనకు వస్తే.. విషయం.. జాతీయ స్థాయికి చేరే అవకాశం ఉంది.