ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. కేంద్రం ఓ కానుక ఇచ్చింది. అది.. మూడు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఉత్పత్తులు అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం. ఇరవై వేల కోట్లు దీని వల్ల ఇండియా నుంచి అమెరికాకు వెళ్తాయి. మొతెరా స్టేడియం ప్రసంగంలో ట్రంప్ దీన్ని స్వయంగా చెప్పుకున్నారు. కానీ ఇండియాకు ఆయన ఒక్క శుభవార్త కూడా చెప్పలేదు. మోదీపై పొగడ్తలు కురిపించి సరి పెట్టారు. ఐక్యారాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దగ్గర్నుంచి ప్రవాస భారతీయుల వీసా సమస్యల వరకూ.. చెప్పుకోవాలంటే.. సవాలక్ష సమస్యలు అమెరికా అధ్యక్షుని కరుణ కోసం వేచి చూస్తున్నాయి. ట్రంప్ అవేమీ పట్టించుకోలేదు.
ట్రంప్, మోదీ ఇద్దరూ ఈ టూర్ తో పరస్పర రాజకీయ ప్రయోజనాలు సిద్ధించేలా చూసుకున్నారన్న అభిప్రాయం మాత్రం బలంగా వ్యక్తమవుతోంది. ట్రంప్ ఇండియాలో చేస్తున్నది ఎన్నికల ప్రచారమనే అభిప్రాయం ఉంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల ఓట్ల కోసం..ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఇది రాజకీయ ప్రయోజనం కల్పించేదే. అగ్రరాజ్యాధినేత.. అంతలా పొగడటం అంటే.. కింది స్థాయి ప్రజల దృష్టిలో ఆయన ఇమేజ్ మరింత పెరిగిపోయినట్లే. ఒకప్పుడు… వీసా నిరాకరించిన అమెరికా దేశ అధ్యక్షుడే… ఇండియాకు వచ్చి మరీ మోదీని అంత గొప్పగా పొగిడారంటే… సామాన్యమైన విషయం కాదు. దీన్ని మార్కెట్ చేసుకోవడంలో.. బీజేపీకి తనదైన శైలి ఉంది.
ట్రంప్ పర్యటనతో దేశానికి.. పాలకులకు పరస్పర ప్రయోజనాలు ఎంతున్నాయనేదానిపై చర్చలు ఇప్పుడల్లా తేలేవి కావు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలు… ఈ పర్యటనతో తీసుకునే చర్యల వల్ల వచ్చే ప్రయోజనాలతో ఆ విషయం తేట తెల్లం అవుతుంది. కానీ ఇప్పుడు కనీస ప్రయోజనాలు పొందే దిశగా అయినా.. అడుగులు పడ్డాయా.. లేదా అన్నదే కీలకం. ఇతర దేశాలకు సాయం చేయాల్సిన వస్తే.. తనకు అగ్రరాజ్యం అనే ముద్ర వద్దని..తమది కూడా అభివృద్ధి చెందుతున్న దేశమని.. ట్రంప్ చెప్పుకుంటారు. అలాగే వ్యవహరిస్తున్నారు. కానీ ఇండియా మాత్రం.. లేనిపోని గొప్పలకు పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.