ఎక్కడైనా ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగితే.. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందా.. అని.. పోలీసులు కొలతలు వేసుకుని రంగంలోకి దిగడం.. చాలా సినిమాల్లో చూసి ఉంటాం. ఇలాంటి పరిస్థితులు.. చాలా సార్లు వివాదాలుగా మారాయి. దిశ ఘటన తర్వాత మరింత ఎక్కువయ్యాయి. అందుకే.. జీరో ఎఫ్ఐఆర్ అనే విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇలాంటి బాదరబందీలు ఏమీ లేకుండా.. ఏపీలో.. ఓ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. ఆ పోలీస్ స్టేషన్‌కు .. రాష్ట్రమే సరిహద్దులు. పోలీసు వ్యవస్థ మొత్తం అధికారాలు ఆ పోలీస్ స్టేషన్ గుప్పిట్లో ఉంటాయి. ఆ పోలీస్ స్టేషన్ మరేదో కాదు.. ఏపీ సర్కార్.. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ పోలీస్ స్టేషన్.
తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జరిగిన ప్రతి విషయాన్ని పరిశీలించి.. తప్పులుంటే… కేసులు పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ .. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, మరో ముగ్గురు డీఎస్పీలు, సీఐలతో మొత్తం 10 మంది సభ్యులు ఈ సిట్‌లో ఉంటారు. దీనికి సంబంధించి జీవో జారీ చేసిన ప్రభుత్వం.. ఈ సిట్ కు పోలీస్ స్టేషన్ హోదా తో పాటు .. రాష్ట్రం మొత్తం పరిధిగా నిర్ణయించింది. గతంలో మంత్రివర్గ ఉపసంఘం.. సీఐడీ.. విజిలెన్స్.. ఇలా పలు రకాల విచారణ సంస్థలు.. అనేక రకాల అవినీతి జరిగిందనే లీకులు మీడియాకు ఇచ్చాయి.
ప్రస్తుతం సిట్ బృందం ఈ నివేదికలన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకోనుంది. అవసరం అయితే.. ఈ సిట్ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కూడా సమన్వయం చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఏ అధికారినైనా, ఏ వ్యక్తినైనా సిట్ పిలిపించి ప్రశ్నించవచ్చని.. కేసులు పెట్టవచ్చని.. నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కక్ష సాధింపుల కోసమే.. ఇదంతా ప్రభుత్వం చేస్తోందని ఆరోపణలు వస్తున్న సమయంలో.. సిట్‌కు సర్వాధికారాలు కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకోవడం.. ఆసక్తి రేపుతోంది.