విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన హామీలలో ఉన్నత విద్యాసంస్థల కొన్నిటిని మోడీ ప్రభుత్వం అమలుచేస్తునప్పటికీ ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి కొన్ని హామీలను అసలు పట్టించుకోవడం లేదు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కారణంగా ప్రజలు, ప్రతిపక్షాల నుండి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటునప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడిని హామీలను అమలుచేయమని గట్టిగా నిలదీసి అడగలేకపోతున్నారు. ఆ కారణంగా ఆ రెండు పార్టీల పట్ల కూడా ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. దానిని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకొంటున్నా తెదేపా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవలసి వస్తోంది.
రాష్ట్రానికి కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరం కనుకనే చంద్రబాబు సంయమనం పాటిస్తున్నారని సర్దిచెప్పుకోవచ్చును. కానీ ప్రత్యేక హోదా వంటిని మినహాయిస్తే మిగిలిన హామీల అమలు విషయంలో మోడీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపికి బారీగా నిధులు మంజూరు చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయనుకోవడానికి లేదు. ఎందుకంటే బిహార్ కి రూ.1.25 లక్షల కోట్లు , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ.80 వేల కోట్లు ఆర్ధిక ప్యాకేజీలు మంజూరు చేసినపుడు ఏ రాష్ట్రమూ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. తమకీ ఇవ్వాలని పోటీ పడలేదు. కనుక విభజన కారణంగా దెబ్బ తిన్న ఏపికి సహాయం చేస్తే వేరే రాష్ట్రాలు కూడా పోటీకి వస్తాయనే వాదన కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికేనని భావించవచ్చును.
తెలంగాణా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు కేంద్రంపై కత్తులు దూస్తూనే అన్నీ సాధించుకొంటున్నాయి. కానీ చంద్రబాబు మోడీ పట్ల ఎంత అణిగిమణిగి వ్యవహరిస్తున్నా, కేంద్ర మంత్రులతో ఎంత చక్కటి స్నేహసంబందాలున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం చాలా అలసత్వం ప్రదర్శించడం చాలా విచిత్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహాయసహకారాలు అందించినట్లయితే, ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడుకి, తెదేపాకే దక్కుతుందనే భయంతోనే సహాయం చేయడానికి వెనుకంజ వేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు నేటికీ అది తనవల్లే సాధ్యమయిందని పదేపదే చెప్పుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం సహకరించినట్లయితే అయన ఏపిని కూడా శరవేగంగా అభివృద్ధి చేసి, రాజధాని నిర్మాణం చేసినట్లయితే ఆ క్రెడిట్ కూడా తన స్వంతం చేసుకొంటారు తప్ప రాష్ట్ర బీజేపీ నేతలతో కనీసం తన స్వంత పార్టీ నేతలతో కూడా పంచుకోకపోవచ్చును.
కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర బీజేపికి కూడా ఆ క్రెడిట్ దక్కనప్పుడు, ఇంకా చంద్రబాబుకి సహాయం చేసి ఆయనను ప్రజల దృష్టిలో హీరోని చేయడం ఎందుకు…తద్వారా రాష్ట్రంలో తెదేపాని ఇంకా బలోపేతం అయ్యేలాగా చేసి, దానితో పొత్తుల కోసం వెంపర్లాడటం దేనికి? తమ పార్టీ భవిష్యత్ ని పణంగా పెట్టడం దేనికి? అని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోందేమో?
కారణాలు ఏవయినప్పటికీ వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రాభివృద్ధి చేసి, రాజధాని నిర్మాణం జరుగకపోతే దానికి ఆ రెండు పార్టీలే మూల్యం చెల్లించవలసి వస్తుంది. తమ పార్టీలకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేదనే ధీమాతో వారు అలసత్వం వహిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండబోదు.