కేసీఆర్ సర్కారు ప్రజలకు ఇచ్చిన ప్రధానమైన హామీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. అయితే, ఆశించిన స్థాయిలో వాటి నిర్మాణం పూర్తికాలేదు. ఇదే అంశాన్ని తన పాదయాత్రలో ప్రముఖంగా చేసుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి రావడానికి పునాది ఈ డబుల్ బెడ్ ఇళ్ల హామీయే అన్నారు. అర్హులైనవారందరికీ ఇళ్లు ఇస్తామని ఓసారి, ఇది నిరంతర ప్రక్రియ అని మరోసారి కేసీఆర్ చెప్పారన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారనీ, దాన్లో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, పనిచేయని నాయకుల పదవులు ఊడగొడతాం అని మాట్లాడుతున్నారనీ… కానీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని తండ్రీ కొడుకులను ప్రశ్నిస్తున్నా అన్నారు రేవంత్.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు మీ పదవుల్ని కూడా ఊడగొట్టాలా వద్దా అన్నారు. తండ్రీ కొడుకులు బాధ్యత తీసుకోరట, కిందనున్న సర్పంచులూ కార్పొరేటర్లను పీకేస్తారట ఇదెక్కి చోద్యం అన్నారు. మీకు లేని బాధ్యత కింది స్థాయి నాయకులకు ఎలా ఉంటుందనీ, మీకు లేని అనర్హత వేటు వారిపై ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. పట్టణ ప్రగతి గురించి మాట్లాడుతూ… గల్లీలు ఊడ్చుకోవడం ఆయన నేర్పాలనా, మన ఇళ్లను మనం ఊడ్చుకోలే, గల్లీలు సాఫ్ చేసుకోమా, పొలాల్లో మొక్కలు నాటుకోలే… కొత్తగా చెప్పాల్నా ఇవి అంటూ రేవంత్ నిలదీశారు. ఇవన్నీ కాదనీ, డబుల్ బెడ్ ఇళ్లు ఎందుకు ఇయ్యలేదో అని ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ఇళ్లు పూర్తికాకపోవడానికి ప్రభుత్వం అవినీతే కారణమనీ, తెరాస నాయకులు కబ్జాలు చేసిన భూముల్లో లక్షలమందికి ఇళ్లు కట్టించొచ్చని రేవంత్ అన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోతే కలక్టరేట్ ముట్టడి చేస్తానని హెచ్చరించారు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బలమైన ప్రచారాస్త్రాన్ని రేవంత్ రెడ్డి ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నట్టున్నారు. నగరంలో కేవలం 108 ఇళ్లను మాత్రమే ప్రభుత్వం కట్టించి ఇచ్చిందనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. పాదయాత్ర రెండో రోజు కూడా ఇళ్ల అంశమే ప్రముఖంగా రేవంత్ ప్రస్థావించారు. ప్రభుత్వం కూడా రేవంత్ విమర్శలను బలంగా తిప్పి కొట్టలేని పరిస్థితి. చూడాలి… రేవంత్ విమర్శలపై అధికార పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడతారేమో!