రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. మార్చి 6వ తేదిన నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో రాజ్యసభకు ఎంపికైన కే.కేశవరావు పదవీకాలం కూడా ముగుస్తోంది. దీంతో ఆయన్ని అధికార పార్టీ ఈ సారి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు అత్యంత సన్నిహితుడైన కే. కేశవ రావు ఎన్నిక దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఢిల్లీలో అన్ని పార్టీలతోను మంచి సంబంధాలు కలిగిన కేకే అభ్యర్ధిత్వం పట్ల పార్టీలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కూడా కేకే అభ్యర్ధిత్వం పట్ల అనుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో రాజ్యసభ రేసులో ఒక్క స్థానం కేకేకు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల సమాచారం. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కుమార్తె, లోక్ సభ మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత రాజ్యసభ సభ్వత్వాన్ని ఆశిస్తున్నారు. సీఎం సతీమణి కూడా ఈ సారి రాజ్యసభ సభ్యత్వాన్ని కుమార్తేకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం దీనికి సరేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉన్న ఒక్క రాజ్యసభ స్ధానం కోసం పార్టీలో ఆశావహులు జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఖమ్మం మాజీ ఎంపీకీ రాజ్యసభ స్ధానం ఇస్తామని గతంలో వాగ్దానం చేసి ఆ స్ధానం నుంచి నామా నాగేశ్వర రావుకు టిక్కట్ ఇచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈసారి రాజ్యసభ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం కే.చంద్రశేఖర రావు మదిలో మాత్రం ఈ ఒక్క స్ధానాన్ని మైనార్టీకి కాని, దళిత వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సస్పెన్స్ వీడాలంటే మరో 10 రోజులు వేచి చూడాల్సిందే…!