రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించి… కొన్ని వేల మంది పేదలు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లోని 1251 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలుగా పంచేందుకు.. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఎలాంటి వివాదాలు లేని భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకపక్క భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుందని పవన్ కల్యాణ్ అంటున్నారు.
రాజధాని భూముల్ని లబ్ధిదారులకు ఇచ్చి.. చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని .. చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందులు పడతారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్, శ్మశాన భూములు, పాఠశాల మైదానాలను.. ఇళ్ల స్థలాలుగా మార్చాలనుకోవడం సరికాదని.. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. ఇలాంటి వాటితో తేలిపోతోందంటున్నారు. జనసేన అధినేత చెప్పిన అభిప్రాయమే.. ఇతర రాజకీయవర్గాల్లోనూ ఉంది. రాజధాని రైతులకు.. ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో.. ఇతరుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఘర్షణ పూరిత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే సమయంలో.. ఏపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప్రదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. స్మశానాలు.. స్కూళ్లు, పార్కుల్ని.. చదును చేసి.. ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నట్లుగా తేలడంతో.. ప్రభుత్వం తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. వీటిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.