ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి టెండర్లపై జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు. ప్రతి టెండర్‌ను.. న్యాయమూర్తి సమక్షంలోని జ్యూడిషియల్ కమిషన్‌కు పంపిన తర్వాత మాత్రమే ఖరారు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు చట్టం చేశారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేయడానికే ఈ చట్టం తెచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని ప్రభుత్వం ప్రకటించింది. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్ కమిషన్ పరిధిలోకి తీసుకురానున్నారు. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలనే విధంగా చట్టం నిబంధనలు ఉన్నాయి.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావును జ్యూడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత జ్యూడిషియల్ కమిషన్.. ఆర్టీసీ కోసం తీసుకుంటున్న 350 ఎలక్ట్రిక్ బస్ టెండర్ల వ్యవహారాన్ని పరిశీలించింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వద్దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తర్వాత దీనిపై ప్రభుత్వం ఏం చేసిందో ఎవరికీ తెలియదు. అదొక్కటి మాత్రం జ్యూడిషియల్ ప్రివ్యూ కోసం వెళ్లినట్లుగా బయటకు తెలిసింది. మరో టెండర్.. అలాంటి ప్రక్రియ కోసం వెళ్లలేదు. ఈ మధ్య కాలంలో… రివర్స్ టెండర్ల పేరుతో.. పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేసి.. కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది ప్రభుత్వం. అవన్నీ టెండర్ల ప్రక్రియే. వాటిలో ఒక్కటంటే.. ఒక్క దాన్ని కూడా జ్యూడిషియల్ ప్రివ్యూకు పంపలేదు.
అవినీతిని అంతమొందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి.. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు చట్టం చేసి.. ఆ తర్వాత న్యాయమూర్తిని అపాయింట్ చేసిన తర్వాత కూడా.. టెండర్లను.. ప్రభుత్వం.. కమిషన్ వద్దకు ఎందుకు పంపడం లేదనే ప్రశ్నకు ఎక్కడా సమాధానం దొరకడం లేదు. ప్రభుత్వం అసలు టెండర్లే పిలవడం లేదా.. అని చాలా మందికి డౌట్ వస్తోంది. కానీ.. టెండర్లు మాత్రం.. ప్రభుత్వం పిలుస్తూనే ఉంది. టెండర్లు లేకపోతే.. రివర్స్ టెండర్లను పిలుస్తున్నారు. ఏదైనా… కానీ.. జ్యూడిషియల్ కమిషన్ వద్దకు మాత్రం వెళ్లడం లేదు. ఇది ముఖ్యమంత్రి చెప్పినదానికి.. .జరుగుతున్న దానికి తేడాగా ఉంది.