పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెరాస నాయకులతో మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలివి! కొత్త మున్సిపల్ చట్టం చాలా డేంజర్ గా ఉందన్నారు! పని చేయకపోతే పదవులు, ఉద్యోగాలు పోవడం ఖాయమనీ, ఆ తరువాత ఎవరు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదన్నారు. నా దగ్గర వచ్చి ఇలా అయిపోయిందీ, అలా అయిపోయిందని మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు! హరితహారంలో నాటిన మొక్కల్లో 85 శాతం బతకాల్సిందే. లేదంటే, కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ల నౌకరీలు పోతయ్ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారన్నారు.
భువనగిరి పరిధిలో జరిగిన మరో కార్యక్రమంలో కూడా కేటీఆర్ ఇదే మాట చెప్పారు. ప్రామిస్ గా చెప్తున్నా… మొక్కల విషయంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారన్నారు. మొక్కలు చనిపోతే ముందుగా తెరాస నాయకుల పదవులే ఊడతాయన్నారు. నేను మజాక్ చేస్తలేదు, పరాసకం ఆడట్లేదు, భవిష్యత్తులో నేను కూడా మిమ్మల్ని కాపాడలేను అని హెచ్చరించారు మంత్రి కేటీఆర్! ఎవరు లంచం అడిగినట్టు దృష్టికి వచ్చినా చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మాట్లాడుతూ… చాలాచోట్ల ప్రజలు అడుగుతున్నారనీ, అర్హులైనవారందరికీ కచ్చితంగా వస్తాయని భరోసా కల్పించారు. పట్టణ ప్రాంతాల్లో చాలా సమస్యలు దృష్టికి వస్తున్నాయనీ, వాటన్నింటినీ ఒక జాబితా తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. అన్నింటికీ ఒకేసారి పరిష్కారం చూపిస్తామన్నారు కేటీఆర్.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైనవారికి ఇస్తామని మోసం చేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఓపక్క తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల కేటాయింపులపై ఆయనే స్వయంగా స్థానిక అధికారులకు ఎంపీగా ఆదేశాలు ఇస్తున్నారు. అర్హులకు ఇచ్చేశామంటూ ఈ మధ్య చాలాసార్లు తెరాస నేతలు సంబరంగా చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారని మాత్రమే కేటీఆర్ స్పందించారు! పట్టణాల్లో చాలా సమస్యలున్నాయని ఆయనే చెబుతున్నారు. స్థానిక నాయకుల్ని, అధికారుల్నీ కొలువులు ఊడతాయని హెచ్చరిస్తున్నారుగానీ… ఒక్క మొక్కల పెంపకం తప్ప ప్రస్తుతానికి వారు చేసేదేం లేదన్నట్టుగా కనిపిస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకుగానీ, పట్టణ ప్రాంతాల్లో ఇతర పనులకుగానీ ప్రభుత్వమే నిధులు మంజూరు చెయ్యాల్సి ఉంది. అయితే, ఈ పాయింట్ హైలైట్ కానీయకుండా… ప్రతీ సభలో కొలువులు పీకేస్తామంటూ నాయకుల మీదికి ప్రజల ద్రుష్టిని మారల్చుతున్నట్టుగా కనిపిస్తోంది. సమస్యలకు కిందిస్థాయి యంత్రాంగాన్ని బాధ్యులుగా చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది.