`బాహుబలి`ని టార్గెట్ చేసి సినిమా తీయాలన్న సాహసం కూడా ఎవరూ చేయని రోజులివి. నాన్ బాహుబలి రికార్డుల్ని చూసి మురిసిపోవడం తప్ప, బాహుబలి దరిదాపుల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు. అయితే… నాగ అశ్విన్ మాత్రం ఏకంగా `బాహుబలి`కే గురిపెట్టాడు. ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. బుధవారమే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ కాంబో గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రాబట్టే ప్రయత్నం చేసింది తెలుగు 360.
ఇదో జానపద కథా చిత్రమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మాయలూ, మంత్రాలూ… తరహా కథ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చందమామ కథలా ఉండబోతోంది. మహానటి పూర్తయ్యాక `పాతాళ భైరవి`లాంటి సినిమా తీయాలని వుందని నాగ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అలాంటి కథలో చిరంజీవి నటిస్తే బాగుంటుందన్న ఆలోచనని అశ్వనీదత్ వ్యక్తపరిచారు. అక్కడే ఈ సినిమా కథకు బీజం పడింది. అప్పటి నుంచీ ఈ కథపై నాగ అశ్విన్ కసరత్తు చేయడం మొదలెట్టారు. ఆ కథ కార్యరూపం దాలుస్తూ.. దాలుస్తూ… ఇప్పుడు పూర్తి స్థాయి స్క్రిప్టుగా మారింది. తీరా చూస్తే… ఈ కథ ప్రభాస్‌కి బాగా నప్పుతుందన్న భావన కలిగింది. ఆ కథని ఆమధ్య చూచాయిగా.. ప్రభాస్‌కి వినిపించడం, తొలి సిట్టింగ్‌లోనే ప్రభాస్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం. అశ్వనీదత్ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపే ఉద్దేశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా రాబోతోంది. తారాగణం, ఇతర నటీనటులు ఇతర భాషల్లోంచి దిగుమతి చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఈ సినిమాలో చాలా చాలా ప్రత్యేకతలు కనిపించబోతున్నాయి. అవి ఒకొక్కటిగా వైజయంతీ మూవీస్ రివీల్ చేయబోతోంది.