ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వ ప్రతి పనిని భూములతో ముడి పెట్టేస్తున్నారు. ఉగాదికి పాతక లక్షల ఇళ్ల స్థలాలిచ్చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. సంక్షేమ పథకాల అమలు కష్టమని.. ఆర్థిక శాఖ అధికారులు సీఎం వద్దకు వెళ్లారు. వారికీ ముఖ్యమంత్రి భూముల్నే చూపించారు. బిల్డ్ ఏపీ పేరుతో భూములు అమ్మి కావాల్సినంత సొమ్ము చేసుకోమని పురమాయించారు. ఇక విశాఖకు రాజధాని మార్చడానికి ఓ ఆరు వేల ఎకరాలకు అధికారులకు ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇక పరిశ్రమలు పెడతామని వచ్చే వారికి భూములు చూపించాలని ఆదేశిస్తున్నారు. పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం 50వేల ఎకరాలు చూడాలని ఆదేశించారు. ఇంకా.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు చివరికి భూముల వద్దకే వెళ్తున్నాయి.
ప్రభుత్వ ప్రయారిటీలో కనిపిస్తున్న ప్రతి అంశంలోనూ భూములే హైలెట్ అవుతున్నాయి. అది పంచడానికైనా.. అమ్మడానికైనా.. కేటాయించడానికైనా. మరి ఇన్ని భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మిస్టరీగా మారింది. పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయడానికే కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఒక్క ఎకరం కూడా ఎక్కడా కొనుగోలు చేయలేదు. బడుగు, బలహీనవర్గాలకు గత ప్రభుత్వాలు .. ఇచ్చిన అసైన్డ్ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిని ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నారు. ఇక ఖర్చుల కోసం ఖజానా నింపుకోవడానికి ఖరీదైన.. యూనివర్శిటీ భూములు, స్టేట్‌గెస్ట్ హౌస్ లాంటి భవనాలు.. ఇతర స్థిరాస్తుల్లాంటివి అమ్మకానికి పెడుతున్నారు. ఏవేవి అమ్ముతారో.. సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఇక పరిశ్రమలకు భూములు.. విద్యుత్ ప్రాజెక్టులకు భూములు వాటి సంగతేం చేస్తారో క్లారిటీ లేదు. కానీ.. అన్నింటికీ.. భూముల వైపే ప్రభుత్వం చూపు ఉంది..
ప్రపంచంలో దేన్నైనా సృష్టించవచ్చు కానీ.. భూమిని సృష్టించలేరు. భూమి ఉత్పత్తి అనేదే ఉండదు. అందుకే.. భూమి విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. భూములు ఉండటమే ప్రభుత్వానికి భరోసా. కానీ ప్రస్తుత ప్రభుత్వం.. ఉన్న భూములన్నింటినీ ఊడ్చి పెట్టేస్తోంది. ప్రభుత్వానికి గజం భూమి లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న యూనివర్శిటీల భూములు… ఖరీదైన గెస్ట్హౌస్ల్లాంటివి కూడా అమ్మకానికి పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ప్రజా అవసరాల కోసం.. ఓ కాలేజీనో.. మరో కట్టడమో కట్టాలనుకుంటే.. భూమి ఎక్కడి నుంచి వస్తుంది..?. అప్పుడు మళ్లీ ప్రజల నుంచే సేకరించాల్సి ఉంటుంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తుల భూముల్ని సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ.. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఉండే భూమి ఇలా సేకరించేదే. దాన్ని అడ్డగోలుగా పంచేస్తూ.. అమ్మేస్తున్న ప్రభుత్వం తర్వాత అవసరాల కోసం మళ్లీ ప్రజల భూముల్నే సేకరిస్తుంది