గ్రే షేడ్స్ ఉన్న హీరో పాత్రల్ని మనవాళ్లు అరుదుగా టచ్ చేస్తుంటారు. ‘లవకుశ’, ‘టెంపర్’లలో ఎన్టీఆర్ ఈ తరహా పాత్రల్ని ఎంచుకుని విజయం సాధించాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానా పోషించిన పాత్రలోనూ గ్రే షేడ్స్ ఉంటాయి. ఓ రకంగా ఆ సినిమాకి తనే హీరో, తనే విలన్. ఇప్పుడు మరోసారి ఆ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు రానా.
రానా – తేజ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కుతోంది. దీనికి ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే పేరు ఖాయం చేశారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ సినిమాలో రానా పాత్ర గ్రే షేడ్స్‌లో ఉండబోతోంది. తన ఎదుగుదల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే పాత్ర అది. స్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా ఆ పాత్రని డిజైన్ చేశాడట తేజ. `నేనే రాజు – నేనే మంత్రి`లో హీరో పాత్ర చిత్రణ కూడా ఇలానే ఉంటుంది. మరోసారి అదే ఫార్ములాలో వెళ్లబోతున్నాడన్నమాట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే కథానాయిక పేరు అధికారికంగా ప్రకటించబోతున్నారు.