విశాఖ రణరంగమైంది. ప్రశాంతమైన సిటీలో ఎన్నో రాజకీయ కార్యక్రమాలు జరిగినా..ఇంత వరకూ ఎప్పుడూ చెలరేగనంత.. ఘర్షణ వాతావరణం ఈ రోజు ఏర్పడింది. చంద్రబాబు విశాఖ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చినప్పటి నుండి… వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి. విమాశ్రయం వద్దకు తీసుకు వచ్చారు. వారందరికీ కోడిగుడ్లు, టమోటాలు కూడా ఇచ్చారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వచ్చినా.. వారందర్నీ చెరగొట్టేసిన పోలీసులు అడ్డుకుంటామని ప్రకటించిన వైసీపీ కార్యకర్తల్ని మాత్రం… విమానాశ్రయంలోకి వదిలారు. దాంతో.. పరిస్థితి అదుపుతప్పింది. ఓ దశలో చంద్రబాబు.. పాదయాత్రగా వెళ్లడానికి సిద్ధమయ్యారు. పోలీసులు నచ్చచెప్పి.. కొద్ది సేపట్లో.. క్లియర్ చేస్తామని చెప్పడంతో కారులో కూర్చున్నారు. అయితే పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని లాగేయడానికి మాత్రం.. పెద్దగా ప్రయత్నం చేయలేదు. దాంతో.. చంద్రబాబు రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది.
ఈ లోపు వైసీపీ నేతలు.. గతంలో ప్రత్యేకహోదా ఉద్యమం కోసం అంటూ.. జగన్మోహన్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన సమయంలో.. పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన ఘటనను.. ప్రస్తావిస్తూ… పగ తీర్చుకున్నారనే ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అప్పట్లో…జగన్ ను విశాఖ రానీయకుండా అడ్డుకున్నారు కాబట్టి.. ఇప్పుడు ఇలా జరిగిందని..దెబ్బకు దెబ్బ అని.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇలా చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులకు సైతం.. ప్రత్యేక ఆదేశాలు అందాయని.. వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ దగ్గరకు వెళ్లేలా చూడాలని ఆదేశించినట్లుగా.. టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సహజంగా భద్రత కల్పించాల్సిన పోలీసులు… టీడీపీ కార్యకర్తలను మాత్రం దూరంగా నెట్టేసి వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్లలేదు.
టీడీపీ నేతలు ఈ అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకున్నారు. పులివెందుల ఫ్యాక్షనిజం.. విశాఖలో ప్రవేశించిందనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏముందని… ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ రోజు కోడిగుడ్లు, టమోటాలు వేశారని..రేపు బాంబులేస్తారని…ప్రకటనలు ప్రారంభించారు.ఈ పరిస్థితులు విశాఖలోనే ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది. ప్రజలు భయభ్రాంతులయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదనే.. విశాఖ ప్రజలు కోరుకుంటారని.. కానీ.. వైసీపీ అడుగు పెట్టక ముందే ఇలాంటి పరిస్థితి తెచ్చిందని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది.