విశాఖలో చంద్రబాబు పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం.. పోలీసులు కనీసం వారిని నియంత్రించే ప్రయత్నం చేయకపోవడంపై.. చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఎన్కౌంటర్ చేసినా వెనక్కి తగ్గేది లేదని.. చంద్రబాబునాయుడు పోలీసులకు తేల్చి చెప్పారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో రెండు రోజుల ప్రజా చైతన్య యాత్రకు వచ్చిన చంద్రబాబును విమానాశ్రయం ఎదుట.. వైసీపీ కార్యకర్తలు అ్డడుకున్నారు. శాంతిభద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ఈ ఘటనే .. చెబుతోందని.. చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ దుర్మార్గంగా తన యాత్రను అడ్డుకుంటుంటే.. పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అనుమతి ఉన్నా యాత్ర సాగని పరిస్థితి ఉందంటే… ఏపీలో పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నట్లని ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతల వైఫల్యమని దీనికి పోలీసులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎంత సమయమైనా.. విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎయిర్పోర్టు ముందు వైసీపీ గూండాలు గుమికూడితే.. ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా అని పోలీసులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగిస్తానని పోలీసులకు చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి..మాపై కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లు వేశారని చంద్రబాబు మండిపడ్డారు. వెనక్కి వెళ్లాలని పోలీసులు చెప్పడంపై విమర్శలు గుప్పించారు. ఏ చట్టం కింద వెళ్లిపోవాలంటున్నారని ప్రశఅనించారు. అరెస్ట్ చేయాలనుకుంటే నోటీసు ఇవ్వాలని … ఎమ్మెల్యేలను బెదిరించడం మంచిపద్ధతి కాదన్నారు.
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నన్ను అడ్డుకున్నారంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విశాఖలో భూములు కబ్జా చేస్తున్నారు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.. ప్రశాంత విశాఖ నగరాన్ని అశాంతి మయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తాను జనంతో మాట్లాడితే వీళ్ల బండారం బయటపడుతుందని అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబును వెనక్కి పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం.. తాను పర్యటనకు వెళ్తానని స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.