ప్రతిపక్ష నేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనేంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు గతంలో ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూంటే.. అడ్డుకోవడమే పనిగా.. ప్రభుత్వం పెట్టుకుంది. గత తొమ్మిది నెలల కాలంలో.. ఏకంగా ఐదు సార్లు చంద్రబాబును ప్రభుత్వం నిర్బంధించింది. మొదట ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రికంగా సృష్టించిందని.. తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..నిరసన చేపట్టినప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు.
చంద్రబాబును ఇంట్లో నుంచి రానీయకుండా.. గేట్లను తాళ్లతో కట్టేసి పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చంద్రబాబు పర్యటనకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంగా ఈ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇలా .. అడ్డుకోవడం చర్చనీయాంశమయింది. మరో సారి అమరావతి జేఏసీ బస్సు యాత్ర ప్రారభించాల్సిన సమయంలో.. పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు పాదయాత్రగా.. బస్సుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. మళ్లీ అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో.. ప్రజా చైతన్య యాత్రకు వెళ్లే సమయంలో… అనుమతి ఇచ్చి మరీ పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి పంపారు.
చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూండటంతో… ప్రభుత్వం భయపడుతోందన్న విమర్శలను ఈ అరెస్టుల కారణంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. ఓ ప్రతిపక్ష నేతను ఇన్ని సార్లు అరెస్ట్ చేయడం ఏమిటన్న చర్చ.. రాజకీయవర్గాల్లో వస్తోంది. ప్రభుత్వం తప్పు చేస్తోంది కాబట్టే… ఇంతగా భయపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అరెస్టులు.. టీడీపీకి ప్లస్ అవుతాయో.. మైనస్ అవుతాయో కానీ.. చంద్రబాబు మాత్రం.. స్వేచ్చగా బయటకు వెళ్లలేకపోతున్నారు.