తెలుగు360 రేటింగ్: 2.75
ఓ మర్డర్ మిస్టరీలోనో, మిస్సింగ్ డ్రామాలోనో ప్రశ్నలెప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.
ఎందుకు జరిగింది?
ఎలా జరిగింది?
ఎవరు చేశారు?
దాదాపుగా ప్రతీ కథలోనూ ఇవే ప్రశ్నలుంటాయి.
కానీ ఒకొక్కరూ ఒక్కోలా సమాధానం చెబుతుంటారు. అంటే.. ఇక్కడ ప్రశ్నలకంటే సమాధానాలు ఆసక్తికరంగా ఉండాలన్నమాట.
సమస్య ఏమిటంటే… చాలామంది దర్శకులు ప్రశ్నల దగ్గర పాస్ అయిపోతున్నారు.
సమాధానాల దగ్గర డింకీ కొడుతున్నారు. `హిట్` చూస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతుంటాయి. ఎందుకు, ఏమిటి, ఎలా? అనే క్వశ్చన్ మార్కులు వేధిస్తుంటాయి. మరి వాటికి సమాధానం `హిట్`లో దొరికిందా? ఆ సమాధానాలు ఆసక్తిని రేకెత్తించాయా?
కథ
విక్రమ్ ఓ ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్. క్లైమ్‌కి సంబంధించిన క్లూస్‌ని చాలా ఈజీగా పట్టేస్తుంటాడు. లాజికల్‌గా తన బ్రెయిన్ చాలా స్ట్రాంగ్. కానీ మనసులో మాత్రం ఏదో వేదన. మంటని చూస్తే భయపడిపోతుంటాడు. తన గతం తనని వెంటాడుతుంది. ఆ ఒత్తిడి వల్ల తనకేమైపోతుందో అన్నది నేహా భయం. విక్రమ్ – నేహా ప్రేమించుకున్నారు. తన మాట విని ఆరు నెలలు ఈ ఉద్యోగాన్ని విడిచి, దూరంగా వెళ్లిపోతాడు. కానీ తీరా చూస్తే… నేహా కనిపించకుండా పోతుంది. మరోవైపు ప్రీతీ అనే అమ్మాయి కూడా మిస్సింగ్. ఈ రెండు కేసుల మధ్య పోలికలు ఒకేలా ఉండడంతో – ప్రీతికేసుని ఛేదించడం మొదలెడతాడు విక్రమ్. మరి ఆ ప్రయాణంలో ఏం తెలుసుకున్నాడు? ప్రీతిని, నేహాని అపహరించింది ఒక్కరేనా? ఈ ఇన్వెస్టిగేషన్‌లో విక్రమ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా దాటుకొచ్చాడు? అనేదే కథ.
విశ్లేషణ
ముందే చెప్పినట్టు ఈ మిస్సింగ్ కేసులో చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి. పైగా ఒకటి కాదు. రెండు కేసులు. అందుకే తెలుసుకోవాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి. అనుమానితులూ ఎక్కువే. అందుకే కావల్సినన్ని ట్విస్టులూ, టర్న్‌లకు స్కోప్ ఉంది. కథని ప్రారంభించిన పద్ధతి చాలా సాఫీగా, ఇంటిలిజెంట్‌గా ఉంది. విక్రమ్ తెలివితేటల్ని చూపించడానికి రెండు ఎపిసోడ్లు వాడాడు దర్శకుడు. అవి లాజికల్‌గా ఉండడంతో – టేకాఫ్ బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ప్రీతి మిస్సింగ్ కేసుతో కథ ట్రాక్ ఎక్కుతుంది. నేహా కూడా మిస్సవ్వడంతో – కావల్సినంత సస్పెన్స్ చోటు చేసుకుంటుంది. అనుమానితుల లిస్టు పెరుగుతున్న కొద్ది.. హంతకుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉత్సాహం, ఉత్సుకత ఏర్పడతాయి. ఇన్ని చిక్కుముడుల్ని దర్శకుడు ఎలా విప్పుతాడా? అనే ఆసక్తి కలుగుతుంది.
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లలో ప్రధాన సమస్య… సెకండాఫ్. సగం సినిమా చూసిన ప్రేక్షకుడు ఇంట్రవెల్‌లో హంతకుడు ఎవరన్నది గెస్ చేయడం మొదలెడతాడు. తన ఆలోచనలకు సినిమా దగ్గరగానైనా ఉండాలి, లేదంటే అతని ఊహని దాటుకుంటూ కొత్త ట్విస్టైనా ఇవ్వాలి. ఏం జరిగినా… తొందరగా జరగాలి. కానీ… ద్వితీయార్థంలో సినిమాని వీలైనంత లాగ్ చేసుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఎలా ఉంటాయో పూస గుచ్చినట్టు వివరించాడు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలన్నీ నచ్చుతాయి. వెళ్లిన ప్రతీ దారీ మూసుకుపోవడంతో.. కొత్త తలుపులు ఎక్కడ తెరచుకుంటాయా అని ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తాడు.
ఎందుకో ఈ సినిమాలో ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యిందేమో అనిపిస్తుంటుంది. నేహా మిస్ అయితే… ఆ పెయిన్ విక్రమ్‌కి ఒక్కడికే కాదు. ఆడిటోరియం మొత్తం తెలియాలి. లేదంటే.. నేహా ఏమైపోతే మనకేంటిలే.. అని ప్రేక్షకుడూ రిలాక్స్ అయిపోతాడు. విక్రమ్ – నేహా మధ్య బాండింగ్ దర్శకుడు చూపించలేదు. ఈ కథకు అది అవవసరం అనుకున్నాడేమో. కాకపోతే.. వాళ్లమధ్య బంధం ఎంత గట్టిగా ఉంటే.. ఎమోషన్ అంత బాగా పండుతుంది. ప్రేక్షకుడ్ని తప్పు దారి పట్టించడానికి దర్శకుడు చాలా పథకాలు వేశాడు. పబ్ నుంచి పారిపోతున్న కుర్రాడిని పట్టుకోవడానికి పది నిమిషాల ఎపిసోడ్ తీశాడు దర్శకుడు. తీరా చూస్తే.. ఆ సీన్ ఫట్టుమంటుంది. కొండని తవ్వి ఎలుకను పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి ఎస్కేపులు ఇంకొన్ని కనిపిస్తాయి. వాటిని కథని లాగ్ చేయడానికి, ఆఖరి ట్విస్టుని ఇంకాసేపు దాచడానికి వాడుకున్నాడంతే. హంతకుడెవరో తెలిశాక.. కాస్త షాకింగ్‌గానే ఉంటుంది. కానీ ఎందుకు చేయాల్సివచ్చింది? అని ఆలోచిస్తే మాత్రం కారణం అంత బలంగా అనిపించదు. విక్రమ్‌కి ఓ గతం ఉందని అర్థమవుతూ ఉంటుంది. దాన్ని ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవ్వడానికి కొన్ని షాట్స్‌ని పదే పదే ప్లే చేస్తుంటాడు. దాంతో విక్రమ్‌కి ఏం జరిగింది? అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. అయితే అదేం చెప్పకుండానే ముగించేశాడు దర్శకుడు. చివర్లో విక్రమ్‌పై జరిగిన ఎటాక్.. పార్ట్ 2కి సిద్ధం చేసుకున్న రంగం.
నటీనటులు
విశ్వక్ సేన్ ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడంటే… ఈ పాత్రలో తనని తప్ప ఇంకెవ్వరినీ ఊహించలేం. తన యాటిట్యూడ్, రెక్లెస్, లోలోపల పడుతున్న స్ట్రగుల్… ఇవన్నీ చక్కగా పలికాయి. ఎక్కడా నటిస్తున్న భావన కలగదు. అంతగా లీనమైపోయాడు. తనతో పోలిస్తే ఏ పాత్రా కంటికి కనిపించదు. ఆఖరికి కిల్లర్‌తో సహా. భానుచందర్ నటన హుందాగా అనిపించింది. రుహానికి హీరోయిన్ అనలేం. మిగిలినవాళ్లంతా సహజంగానే తమ పాత్రల్లో ఇమిడిపోయారు. .
సాంకేతిక వర్గం
స్క్రిప్టు పక్కాగా ఉంటే చాలు. ఇలాంటి సినిమాలు వర్కవుట్ అయిపోతాయి. కథ, కథనం, ట్విస్టులు… వీటికి సాంకేతిక నైపుణ్యంతో పనిలేదు. కానీ సినిమాలో క్వాలిటీ కనిపించాలి. నేపథ్య సంగీతం ఈ కథలోని మూడ్‌ని మరింత ఎలివేట్ చేసింది. సంభాషణలు అత్యంత సహజంగా ఉన్నాయి. వేరే ట్రాకులు పట్టకుండా సస్సెన్స్ డ్రామాని, సస్సెన్స్ డ్రామాలానే నడిపించడానికి నిజాయతీగా పనిచేశారు. దర్శకుడి విజన్ బాగుంది. దానికి ఇంకాస్త మెరుగులు పెట్టి ఉంటే.. `హిట్` అనే పేరుకి సార్థకత చేకూరేది.
ఫినిషింగ్ టచ్: హిట్టయ్యేదే… కానీ
తెలుగు360 రేటింగ్: 2.75