ముందస్తు అరెస్ట్ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వారిని కానీ.. పర్యటనకు పర్మిషన్ తీసుకున్న వారిని ఎలా అరెస్ట్ చేశారని.. హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారపక్షానికి ఒక రూల్.. ప్రతిపక్షానికి మరో రూల్ ఉంటుందా .. చట్టం ముందు అందరూ సమానమే కదా అని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత.. 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ముందస్తు అరెస్ట్ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా.. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగడంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది నోరు విప్పలేకపోయారు.
ఆందోళనలు చేస్తామని చెప్పిన వారిని ఎయిర్‌పోర్టుకు రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించింది. 151 సీఆర్పీసీ నోటీసు చంద్రబాబుకు ఇవ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్థులు, నేరాలు చేసే ఆలోచన ఉన్నవారికి మాత్రమే..151 సీఆర్పీసీ నోటీసు ఇస్తారు కదా.. అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతకు ఎందుకు షరతులు విధిస్తున్నారని.. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయటం ఏంటని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై.. మార్చి రెండో తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.
హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది చంద్రబాబును ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరించలేకపోయారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై… హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. చట్ట విరుద్ధంగా చేస్తున్నారంటూ… దాదాపుగా ప్రతీ కేసులోనూ.. విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపైనా.. అదే తరహా విమర్శలు వచ్చాయి. హైకోర్టులో ప్రతీ రోజూ.. ప్రభుత్వానికి సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా విచారణకు వస్తున్నాయి.