భయం… ! ఇప్పుడు.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ భయం కరోనా అనే వైరస్. ఆ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం అంతం అయిపోతుందన్న ఆందోళనకు వచ్చేస్తున్నారు. దేశదేశాలకు పాకిపోతున్న వైరస్ కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోతున్నాయి. చైనాలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఉత్పాదక రంగం నిలిచిపోయింది. ఇతర దేశాల్లో పాజిటివ్‌గా వెలుగు చూస్తున్న కేసులతో.. ఆయా దేశాల్లోనూ.. భయానక వాతావరణం ఏర్పడుతోంది. ఆ ప్రభావం ఇండియాపైనా పడింది. స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ఆ కుప్పకూలడం.. అలా ఇలా.. కాదు… మళ్లీ లేవడం కష్టమన్నంతగా ..!
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా ప్రబలుతోందనే భయాలు మార్కెట్లను వణికిపోతున్నాయి. ఐదు లక్షల కోట్లకుపైగా.. మదుపరుల సంపద ఆవిరైపోయింది. 2008 తర్వాత మార్కెట్లు ఇంతగా భయపడిన ఘటన ఇదే. కరోనా భయానికి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా వణికిపోతున్నాయి. వాల్‌స్ట్రీట్, డౌజోన్స్ సూచీలు భారీగా పతనం కావడం ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. జపాన్, చైనా సూచీలు కూడా.. తిరోగమనంలోనే ఉన్నాయి.
కరోనా వైరస్ విజృంభణ.. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందన్న అభిప్రాయం.. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఓ రకంగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. కరోనా యుద్ధం ప్రకటించిందని.. అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రత కన్నా..వైరస్ భయమే.. ప్రధానంగా మార్కెట్ల పతనాన్ని శాసిస్తోంది. ఉత్పాదక కార్యకలాపాలు తగ్గిపోవడంతో.. ఈ ప్రభావంతో ముందు ముందు పరిస్థితి దారుణంగా మారడానికి కారణం అవుతుందంటున్నారు.